Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణ‌ ఇక లేరు,నివాళి

Published : Nov 15, 2022, 06:33 AM ISTUpdated : Nov 15, 2022, 08:22 AM IST
 Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణ‌ ఇక లేరు,నివాళి

సారాంశం

సూపర్‌స్టార్ కృష్ణ మృతి చెందారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అభిమానులతో పాటు , సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు. 


తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సీనియ‌ర్ నటుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు సూపర్‌స్టార్ కృష్ణ మృతి చెందారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అభిమానులతో పాటు , సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు. 

గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆదివారం రాత్రి  రెండు గంటల సమయంలో శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడ్డారు. స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. దీంతో ఆయ‌న్ని వెంట‌నే కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసారు. వెంటనే ఎమర్జన్సీ వార్డుకు తరలించి, సీపీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. నిపుణలైన డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. 

ఇదే ఏడాది జనవరిలో ఆయన పెద్ద కొడుకు రమేష్ మరణించడం వల్ల డల్ అయ్యారు. ఈ లోగా ఆయన భార్య ఇందిరా దేవి మరణించారు. మరో ప్రక్క ఆయన తనకి అత్యంత సన్నిహితుడు అయిన బి.ఎ.రాజు దూరమవ్వడం కూడా తీరని లోటు.

తెలుగు సినీ పరిశ్రమకి చాలా కొత్త విషయాలను, టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116) ఆయనే చేశారు. మొదటి కౌబాయ్ మూవీ (మోసగాళ్లకు మోసగాడు) చేసిందీ ఆయనే. తొలి ఫుల్‌ స్కోప్‌ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’తో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు. తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో వాహ్వా అనిపించుకున్నారు. స్టీరియోఫోనిక్ సిక్స్ ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన మొదలటి సినిమా కూడా ఇదే. ‘కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్‌‌ఓ సాంకేతికతను పరిచయం చేశారు. ‘గూడుపుఠాణి’తో ఓఆర్‌‌డబ్ల్యూ కలర్‌‌ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలేదొంగలు’ కూడా కృష్ణదే.

ఇక బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మద్రాస్‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ నటించిన ‘చీకటి వెలుగులు’ అని రికార్డులు చెబుతున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ అయితే హైదరాబాద్‌లో సంవత్సరం పాటు ఆడి రికార్డును నెలకొల్పింది.  పండంటి కాపురం, దేవుడు చేసిన మనుఫులు, ఊరికి మొనగాడు, ఈనాడు, అగ్నిపర్వతం.. ఇలా చాలా సినిమాలు తిరుగులేని విజయాల్ని అందించాయి. ముప్ఫై సంక్రాంతులకు ఆయన సినిమాలు విడుదలైతే.. 1976 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు కంటిన్యుయస్‌గా ప్రతి సంక్రాంతికీ ఆయన సినిమా విడుదలవడం మరో రికార్డ్.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?