
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరికోసం ఒకరు సాయం చేసుకుంటుంటారు. సినిమాల్లో చాలా కథలకు వాయిస్ ఓవర్ లు అవసరం అవుతుంటాయి. కథని నేరేట్ చేసేలా తమ చిత్రాలకు పవర్ ఫుల్ వాయిస్ కోసం హీరోలు, దర్శకులు వెతుకుతుంటారు. ఇప్పుడు ఆ అవసరం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రానికి వచ్చింది.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో మేకర్స్ ఈ చిత్రానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. రాధే శ్యామ్ కథని నేరేట్ చేసేందుకు వాయిస్ ఓవర్ అవసరం. దీనితో ఆయా భాషల్లో ప్రముఖ సెలెబ్రిటీలని రంగంలోకి దించే పనిలో చిత్ర యూనిట్ ఉంది.
రాధే శ్యామ్ హిందీ వర్షన్ కి బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. దీనితో హిందీలో ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తెలుగు వర్షన్ కోసం కూడా ఒక స్టార్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు రాధే శ్యామ్ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాధే శ్యామ్ చిత్రం రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు.
ఇలాంటి కథకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్షా లాంటి చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించారు. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తన ఫ్యామిలీ మెంబర్స్ చిత్రాలకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ అందించారు. అది వేరే విషయం. కానీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి అందులోను రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే న్యూస్ ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.