
నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సిద్ధార్థ్ కి కాబోయే భార్య పేరు ఐశ్వర్య. ఈమె వృత్తిరీత్యా డాక్టర్ అని సమాచారం. పెద్దలు ఈ సంబంధం కుదిర్చారట. సిద్ధార్థ్-ఐశ్వర్యల నిశ్చితార్థం వేడుకకు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. కమెడియన్ అలీ, టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు బ్రహ్మానందం ఆహ్వానం మేరకు విచ్చేశారు.
బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా సిద్దార్థ్ చిన్నవాడు. విదేశాల్లో చదువుకున్న గౌతమ్ అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు వినికిడి. సిద్ధార్థ్ గురించి పెద్దగా తెలియదు. అతడు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ సుపరిచితుడే. 2004లో విడుదలైన పల్లకిలో పెళ్లి కూతురు మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. అనంతరం బసంతి, మను, బ్రేక్ అవుట్ వంటి చిత్రాల్లో నటించాడు.
గౌతమ్ కి చాలా కాలం క్రితమే వివాహమైంది. ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. ఇక బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం బ్రహ్మానందం అనారోగ్యం బారినపడ్డారు. ఆ సమయంలో సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇటీవల బ్రహ్మానందం నటించిన రంగమార్తాండ విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన తన శైలికి భిన్నంగా భావోద్వేగంతో కూడిన పాత్ర చేశారు. ప్రేక్షకులతో కన్నీరు పెట్టించారు.