
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'స్పైడర్' చిత్ర టీజర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రిలీజ్ చేసిన కాసేపటికే టాప్ ట్రెండింగ్స్ లో నిలిచిన ఈ టీజర్ 24 గంటలు గడిచేలోపే... ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో కలిపి 8.6 మిలియన్ డిజిటల్ వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక టీజర్‌కు ఒకరోజులో ఇంత భారీ రెస్పాన్స్ రావడం సౌతిండియాలో ఇతే తొలిసారి. దీన్ని బట్టి మహేష్ బాబు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టీజర్ రెస్పాన్స్ అదిరిపోవడంతో దర్శక నిర్మాతల్లో ఉత్సాహం నెలకొంది.
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్' కొత్త టీజర్‌ను విడుదల చేశారు. దీంట్లో మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రజల ప్రాణాలు బలిగొంటూ వారిలో భయాన్ని పుట్టిస్తున్న ఓ రాక్షసుడి ఆట కట్టించే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరి మధ్య జరిగే రొమాన్స్ ప్రేక్షకులను మరింత ఎంటర్టెన్ చేయనుంది. ఈ చిత్రంలో రకుల్ జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది.
నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9 మా హీరో మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ విడుదల చేశాం. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ ఒక్క పాట చిత్రీకరణ ఆగస్ట్ 23 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆల్‌రెడీ డబ్బింగ్, రీకార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.