తెలంగాణ, ఏపీ సీఎంలకు సిరివెన్నెల కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు.. కారణమిదే..

By Aithagoni RajuFirst Published Dec 1, 2021, 8:13 PM IST
Highlights

సిరివెన్నెల కుటుంబ సభ్యులు అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇరు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలియజేశారు.

పాటల మాంత్రికుడు, లెజెండరీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela) మంగళవారం లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌ షాక్‌కి గురైంది. తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తుంది. సిరివెన్నెల భౌతికకాయాన్ని చివరి సారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు క్యూ కట్టాయి. చిరంజీవి, మహేష్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వెంకటేష్‌, నాగార్జున, రానా, రాజశేఖర్‌ ఇలా అనేక మంది స్టార్లు సిరివెన్నెలకు నివాళ్లర్పించారు. సిరివెన్నెల అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) ఫిల్మ్ నగర్‌లో మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. 

ఇదిలా ఉంటే తాజాగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇరు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలియజేశారు. `తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు (1-12-2021 ) ఉదయం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున  తాము అందించే సాయం గురించి ప్రస్తావించారు. మా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన చెప్పిన ధైర్య వచనాలు పట్ల, మరియు ప్రభుత్వానికి మా కుటుంబం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందని సిరివెన్నెల ఫ్యామిలీ పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం సహాయంపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. `బుధవారం ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలియజేశారు. సిరివెన్నెల 30/11/2021 సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైన విషయం తెలిసిందే. 

గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది` అని సిరివెన్నెల కుటుంబ సభ్యులు చెప్పారు. 

also read: తీవ్ర నష్టం తప్పదు.. జగన్ ప్రభుత్వానికి రాఘవేంద్ర రావు సంచలన లేఖ

also read: ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..
 

click me!