
మధుర గాయని వాణీ జయరామ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమని, అభిమానులు దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. నేడు శనివారం ఆమె చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాణీ జయరామ్ చిత్ర పరిశ్రమకి, సంగీతానికి చేసిన సేవలు గుర్తిస్తూ పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. అంతలోనే ఆమె మరణించి తీరని వేదన మిగిల్చారు. సంగీత ప్రియులు ఆమె అద్భుత గాత్రాన్ని తలుచుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. వాణీ జయరామ్ చివరిగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే ఆమె మరణించారు.
పద్మభూషన్ అవార్డు ప్రకటించిన తర్వాత వాణీ జయరామ్ కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. అవే ఆమె చివరి మాటలు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనవరి 30న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఈ వీడియో రిలీజ్ చేశారు.
ఆమె ఒక తమిళ పాట పాడుతూ.. అందరికి నమస్కారం.. నేను వాణీ జయరామ్ ని మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి పాటలు పాడుతున్నా. వేల పాటలు పాడా. నా ప్రయాణంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు. పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డుని నాకుదక్కిన గౌరవం గా భావిస్తా' అని ఎంతో సంతోషంగా ఈ వీడియోలో ఆమె మాట్లాడారు. కానీ వారం కూడా గడవక ముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం విషాదంగా మారింది.