శాతకర్ణిలో యుద్ధ సన్నివేశాలకిచ్చిన ప్రాధాన్యత చరిత్రకు లేదు

First Published Jan 13, 2017, 2:41 PM IST
Highlights
  • సంక్రాంతి కానుకగా రిలీజై సంచలనం సృష్టిస్తున్న శాతకర్ణి
  • గౌతమి పుత్బార శాతకర్ణి నందమూరి బాలకృష్ణ వందో చిత్రం
  • చిత్రంలో యుద్ధాలు తప్ప చరిత్రకు దక్కని ప్రాధాన్యం
  • బాలయ్య డైలాగులతోనే ఆకర్షిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా

సంక్రాంతికి రిలీజైన బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం అంటూ అంతా చెప్పుకున్న మాట వాస్తవం. కానీ తెలుగు వారి పురాతన చరిత్రకు, శాతవాహన వైభవానికి, అమరావతి రాజసానికి పట్టం గడతామంటూ చెప్పుకుని ముందుకొచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో అసలు చరిత్ర పక్కకు వెళ్లి యుద్ధ కండూతికి, యుద్ధ సన్నివేశాలకు ప్రాముఖ్యం ఇవ్వడం సగటు సినీ ప్రేక్షకున్ని నిరాశకు గురి చేస్తోంది.

 

అతి తక్కువ సమయంలో అంటే కేవలం 80 రోజుల్లో రికార్డు స్థాయిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న శాతకర్ణి సినిమా చరిత్ర కంటే యుద్ధ దృశ్యాలకు పట్టం కట్టి కమర్షియల్ విలువలు పునాదిగా ముందుకొచ్చిందని చెప్పాలి. చరిత్ర పై ఆసక్తిగల సగటు ప్రేక్షకుడు శాతకర్ణి గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ సినిమాకు వెళ్తే మాత్రం తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఈ చిత్రంలో మనకి లభించేది అరకొర సమాచారం మాత్రమే. 'గౌతమిపుత్ర శాతకర్ణి' పరిపాలనా దక్షతా, వ్యవహార శైలి, ఆలోచనా విధానాలు, చేపట్టిన సంస్కరణలు వగైరా విషయాలపై క్రిష్‌ అస్సలు దృష్టి పెట్టలేదు. క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. అయితే యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో టూ మచ్ అయ్యాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 

రెండు గంటలంపావు నిడివి ఉన్న శాతకర్ణి చిత్రంలో డ్రామాకి కనీసం పావు వంతు స్కోప్‌ కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యకరమే. చిత్రం  ప్రధమ,ద్వితియార్ధంలో కూడా సింహభాగం యుద్ధ సన్నివేశాలే ఉండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగువారు గర్వించే ధీరత్వాన్ని ప్రదర్శించిన శాతకర్ణిపై  క్రిష్‌లాంటి దర్శకుడు తీసిన చిత్రంలో కేవలం యుద్ధాలు మినహా ఎక్కువ వివరాలు లేకపోవడం నిరాశ పరుస్తుంది. శాతకర్ణి గురించిన ముఖ్యమైన పూర్తి సమాచారం ఇవ్వడంలో ఈ చిత్రం విఫలమైందనే చెప్పాలి.

 

శాతకర్ణి చరిత్ర కంటే బాలకృష్ణ రౌద్ర రస పూరిత నటన, సాయిమాధవ్‌ బుర్రా అత్యద్భుతమైన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాయి. అంతే తప్ప శాతకర్ణి  గురించి లోతయిన వివరాలేం చెప్పలేక పోవడం కథను తయారుచేసుకోవడంలో వైఫల్యమనే చెప్పాలి. కేవలం యుద్ధ సన్నివేశాలతో సినిమాను నడిపించొచ్చనే ఆలోచన దర్శకునికి కలిగిందా అనే అనుమానం రాకమానదు.

click me!