సీనియర్ దర్శకులు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ప్రకటన చేశారు. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన తరుణ్ మజుందార్ మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు తరుణ్ మజుందార్ (Tarun Majumdar Dies)జులై 4 సోమవారం మరణించారు. కలకత్తాలోని ఎస్ ఎస్ కె ఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న తరుణ్ మజుందార్ ని కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల తరుణ్ మృతిపై చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మధ్య తరగతి కుటుంబ పరిస్థితులను వెండితెరపై గొప్పగా ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. కెరీర్ లో గొప్పగొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ మజుందార్ 4 నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం. అలాగే 5 సార్లు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
బాలికా బధు (1967), కుహేలి (1971), శ్రీమాన్ పృథ్వీరాజ్ (1973), ఫూలేశ్వరి (1974), దాదర్ కీర్తి (1980), భలోబాసా భలోబాసా (1985), అపన్ అమర్ అపన్ (1990) వంటి చిత్రాలు ఆయనకు కీర్తి తెచ్చిపెట్టాయి. తరుణ్ మజుందార్ భార్య సంధ్య రాయ్ సైతం నటి కావడం విశేషం.ఆయన దర్శకత్వం వహించిన 20 చిత్రాల్లో సంధ్యా రాయ్ నటించారు. మౌషుమి ఛటర్జీ, మహువా రాయ్‌చౌదరి, అయాన్ బెనర్జీ, తపస్ పాల్ వంటి నటులను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.