
80లలో శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలారు సిల్క్ స్మిత. ఈ పల్లెటూరి అమ్మాయి సౌత్ ఇండియాను షేక్ చేశారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కాగా అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తెలిసినవారు లేరు, అక్షరం ముక్కరాదు... కేవలం బ్రతకాలన్న మొండితనం ఆమెను సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక్కో విషయం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ స్టార్ అయ్యారు. వందల చిత్రాల్లో నటించారు. ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లిన తారాజువ్వలా వెలుగులు చిమ్మి అంతలోనే కనుమరుగైంది.
1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత 35 ఏళ్ల ప్రాయంలో కన్నుమూసింది. చెన్నైలో సిల్క్ స్మిత తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. సిల్క్ స్మిత మరణం మీద అనేక పుకార్లు ఉన్నాయి. సిల్క్ స్మితతో అనుబంధం ఉన్న సీనియర్ నటి కాకినాడ శ్యామల తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిల్క్ స్మిత వ్యక్తిత్వాన్ని ఆమె కొనియాడారు.
'నేను పలు చిత్రాలకు ఫైనాన్స్ అందించాను. సిల్క్ స్మిత సొంతగా నిర్మించిన ఓ సినిమాకు కూడా ఫైనాన్స్ చేశాను. ఆ మూవీ ఆడలేదు. దాంతో సిల్క్ స్మిత డబ్బు, ఆస్తులు పోగొట్టుకుంది. అప్పులపాలైంది. అయితే ఆమె అందరి అప్పులు తీర్చేశారు. సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె వెండితెర మీద కనిపించేది వేరు. ఆమె నిజ జీవితం వేరు. నిజాయితీగా ఉండేవారు. అప్పులు తీర్చేసి సిల్క్ స్మిత మరలా నిలదొక్కుకున్నారు. అప్పుడే ఆమె కన్నుమూశారు.
సిల్క్ స్మితను హత్య చేశారని కొందరు అంటారు. మరికొందరేమో ఆత్మహత్య చేసుకున్నారని అంటారు. నిజం ఏమిటనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు... అని ఆమె చెప్పుకొచ్చారు. 2011లో ఆమె బయోపిక్ డర్టీ పిక్చర్ టైటిల్ తో తెరకెక్కింది. విద్యాబాలన్ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీ విద్యాబాలన్ కి మంచి పేరు తెచ్చింది.