
కన్నడ అమ్మాయి అయిన ఆమనిని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఆమె తెలుగువారే అని చాలా మంది భావిస్తారు. ది గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లు ఉండే ఆమని అసమాన ప్రతిభతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అమాయకత్వం గడుసుతనం అనే రెండు భిన్నమైన పార్శ్వాలను సహజంగా పలికిస్తుంది ఆమని. మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం చిత్రాల్లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
1997 వరకు ఆమని హీరోయిన్ గా చిత్రాలు చేశారు. ఓ ఏడేళ్లు గ్యాప్ ఇచ్చి 2004లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తల్లి పాత్రలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆ నలుగురు వంటి గొప్ప చిత్రాలు ఆమె ఖాతాలో పడ్డాయి. 2021లో శ్రీకారం, చావు కబురు చల్లగా, అర్ధ శతాబ్దం, రిపబ్లిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి తెలుగు చిత్రాల్లో ఆమని కీలక రోల్స్ చేశారు.
తాజాగా ఆమని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఆమె ఓపెన్ గా చెప్పారు. సినిమా అవకాశాల కోసం రోజు పలు ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. ఈ క్రమంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. రకరకాల పరిస్థితులు చూశాను. ఎక్కడికెళ్లినా మా అమ్మగారు తోడు ఉండేవారు. నన్ను లోపలికి పిలిచి అమ్మను బయట కూర్చోమనేవాళ్ళు. మీ అమ్మ లేకుండా ఒంటరిగా రావడం అలవాటు చేసుకో. అప్పుడు అవకాశాలు వాటంత అవే వస్తాయి అనేవారు.
మా అమ్మ లేకుండా రావడం కుదరదని నేను గట్టిగా చెప్పి వచ్చేసే దాన్ని. అప్పుడు మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో సినిమా పరిశ్రమ వద్దన్నారో తెలిసొచ్చింది. అలాంటి పరిస్థితులను చూశాను. మొదట్లో సిస్టర్ రోల్స్ వచ్చాయి. ఒకసారి చేస్తే అలాంటి పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందని చేయలేదు. హీరోయిన్ ఆఫర్ వచ్చే వరకు వేచి చూశాను... అని ఆమని చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు అనుభవమైందని, ఆమని వెల్లడించారు.