నటి, ఫిల్మ్ మేకర్‌ ఆయేషాపై దేశద్రోహం కేసు..మాతృభూమికోసం పోరాడతానన్న నటి

By Aithagoni RajuFirst Published Jun 12, 2021, 1:41 PM IST
Highlights

లక్షద్వీప్‌ నటి, ఫిల్మ్ మేకర్‌ ఆయేషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ని జీవాయుధంతో పోల్చినందుకుగానూ ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు.

లక్షద్వీప్‌ నటి, ఫిల్మ్ మేకర్‌ ఆయేషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ని జీవాయుధంతో పోల్చినందుకుగానూ ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. అంతకు ముందు ప్రశాంతంగా ఉన్న ద్వీపంలో ప్రఫుల్‌ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా కేసులు పెరిగాయని, కోవిడ్‌ 19ని అరికట్టడంలో విఫలమైందని, దీంతో ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన బయో వెపన్‌గా అభివర్ణించింది ఆయేషా సుల్తానా. ఓ మలయాళ న్యూస్‌ ఛానెల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు.

`లక్ష్య ద్వీప్‌లో గతంలో ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు రోజుకి వంద కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్‌కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతుంది` అని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. లక్షద్వీప్‌ బీజేపీ నేత సి అబ్డుల్‌ ఖదేర్‌ హాజీ కవరట్టి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయేషాపై కేసునమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 124(ఏ) రాజద్రోహం కేసు, అలాగే 153(బి) రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రఫుల్‌ నిర్ణయాలపై లక్షద్వీప్‌లో వ్యతిరేకత ఎదురవుతుంది. 

తాజాగా తనపై కేసులు నమోదు కావడంపై ఆయేషా స్పందించింది. రాజద్రోహం కేసు నమోదైనా బయపడనని తేల్చి చెప్పింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, తన మాతృభూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. మరోవైపు ఆయేషాకి మద్దతు పెరుగుతుంది. అక్కడి ప్రజా సంఘాలు ఆమెకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. `ఆమెను దేశ వ్యతిరేకురాలిగా చిత్రీకరించడం సరైనది కాదు. నిర్వహకుడి అమానవీయ విధానానికి వ్యతిరేకంగా ఆమె స్పందించింది. పటేల్‌ జోక్యమే లక్షద్వీప్‌ని కోవిడ్‌ ప్రభావిత ప్రాంతంగా మార్చింది. ఇక్కడి సాంస్కృతిక సంఘం ఆమెతో నిలుస్తుందని, లక్షద్వీప్‌ సాహిత్య ప్రవర్తక సంఘం ప్రతినిధి కె బహీర్‌ తెలిపారు. అంతేకాదు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రఫుల్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. వారు ఏకంగా రాజీనామాలకు సిద్ధమవడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడేక్కాయి. 
 

click me!