
బాహుబలి తర్వాత రాజమౌళి చెక్కిన మరో అద్భుత కళాఖండం ఆర్ఆర్ఆర్. దాదాపు రేండేళ్ళకు పైగా ఎన్నో ఇబ్బందుల తరువాత మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను పలుకరించిన ఈ సినిమా.. వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి తన టాలెంట్ తో మాయ చేశాడు జక్కన్న.ఈమూవీ తో 1000కోట్ల కలెక్షన్ మార్కును ఇండియాలో రెండు సార్లు టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు.
అంతే కాదు నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటీ ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది. పాత రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. రిలీజ్ అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా.. హాలీవుడ్ లో కూడా ఇంకా చార్చనీయాంశంగా మారింది ట్రిపుల్ ఆర్.
మే 20 నుంచి ఓటీటీలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అయ్యింది. కాగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్‌లో ఈ మూవీ అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరుసగా మూడు వారాల పాటు అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ నెట్‌ఫ్లిక్స్‌లో మొదటివారం 1 కోటీ 80 లక్షల అవర్స్ పైగా వీక్షించగా.. రెండవ వారం 1 కోటి 39 లక్షల అవర్స్‌కు పైగా వీక్షించినట్లు అఫిషియల్‌గా ప్రకటించారు.
ఇక తాజాగా మూడోవారం కూడా తన రికార్డ్స్ ను కటీన్యూ చేస్తూ.. దాదాపుగా 50 లక్షల 23 వేల వ్యూస్‌తో మొదటి స్థానంలో నిలిచింది ట్రిపుల్ ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా ఓటీటీలోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లుగా నటించారు.