
మాస్ మహారాజ రవితేజ తన సినిమా షూటింగ్ లో గాయాల పాలయ్యారు. మోకాలికి దెబ్బతగడంతో సుమారు 10 కుట్లు పడ్డాయని తెలిసింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగి కొద్ది రోజుల అయింది. తాజాగా ఆయన తిరిగి సెట్స్ లోకి రావటంతో వెలుగులోకి వచ్చింది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ పట్టుకున్న తాడు జారిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండానే రవితేజ గురువారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట. తనవల్ల ఇతర నటులు, సాంకేతిక నిపుణుల డేట్స్‌లో మార్పు రాకూడదని, నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారని చెప్తున్నారు.
స్టూవర్ట్‌పురం గజదొంగ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రవితేజ ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో కనిపించనున్నారు. ‘దొంగాట’ ఫేం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది.
రవితేజ మిగతా చిత్రాల విషయానికి వస్తే...ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇక రామారావు ఆన్ డ్యూటీతో పాటు 'రావనాసుర', 'టైగర్ నాగేశ్వర రావు', 'ధమాకా' వంటి చిత్రాల షూటింగ్స్‌లో కూడా ఒకేసారి పాల్గొంటున్నాడు రవితేజ. ఈ లోగా తను మరో కథను ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
యాంకర్ ప్రదీప్‌ను హీరోగా పరిచయం చేస్తూ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మున్నా. ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కినా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే మున్నా చెప్పిన ఓ రొమాంటిక్ కామెడీ కథను రవితేజ ఓకే చేశారట. అంతే కాకుండా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నట్టు సమాచారం. వీటితో పాటు ‘రావణాసుర’ సినిమా ఆయన చేతిలో ఉంది.