
గత ఏడాది పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాటు కాంతారా కూడా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ కాంతార తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.
కర్ణాటకలోని తుళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాంతార చిత్రానికి, రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరో స్టేటస్ కొట్టేశాడు. అన్ని భాషల్లో ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కుల లెక్క వేరే.
ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో ఆసక్తి పెంచేసింది. ఇదిలా ఉండగా రిషబ్ శెట్టి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా హృదయాలు దోచుకుంటున్నారు. రిషబ్ శెట్టి స్వగ్రామం కెరటి దక్షిణ కర్ణాటకలో ఉంది. తాజాగా రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి ఈ ఏడాది చారిటి ట్రస్ట్ కూడా ప్రారంభించారు. తన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు రిషబ్ శెట్టి కెరటిలో పాఠశాలని సందర్శించాడు. పాఠశాలని దత్తత తీసుకోవడం పై రిషబ్ ఉపాధ్యాయులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు అంటూ గ్రామ పెద్దలు నాయకులు అభినందిస్తున్నారు.