
అందం, నటన కలగలిపిన నటి రెజీనా. అయినా ఆమె హీరోయిన్‌గా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. రవితేజ, సాయిధరమ్, గోపీచంద్ లాంటి హీరోల సరసన నటించినా ఆ తరువాత నెక్స్ట్ రేంజ్ హీరోల్ని అందుకోలేక పోయింది. రెజినాకు ఎందుకో సడెన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కొన్ని ఫ్లాపులు ఆమెను మరింత వెనక్కి లాగేశాయి.
దీంతో తెలుగులో సినిమాలే కరవైపోయాయి. దాదాపు ఏడాది నుంచి టాలీవుడ్‌కు దూరమైపోయింది రెజీనా. ఇక ఆమెకు మళ్లీ తెలుగులో ఛాన్సులు దొరకడం కష్టమే అనుకున్నారంతా. ఐతే ఆమెకు టాలీవుడ్‌లో ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది.
అయితే ఇది రెజీనా స్థాయికి తగ్గ ఆఫర్ మాత్రం కాదు. దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరో పక్కన నటించబోతోంది రెజీనా. అర్జున్ సాయి అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే హరే రామ హరే కృష్ణ అనే చిత్రంలో రెజీనా నటిస్తోంది. అనూప్ రూబెన్స్.. రసూల్ ఎల్లోర్ లాంటి ఫేమస్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా రెజీనా రాత మారుస్తుందేమో చూడాలి. తెలుగులో ఆమె చివరగా నటించిన సినిమా ‘నక్షత్రం’ విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమిళంలో మాత్రం రెజీనాకు రెండు మూడు సినిమాలున్నాయి.