`రజాకార్‌` ట్రైలర్‌.. ఏం చూపించారు.. ఎలా ఉంది?.. వివాదం ఏంటంటే?

By Aithagoni Raju  |  First Published Feb 12, 2024, 3:13 PM IST

రజాకార్ల ఆగడాల నేపథ్యంలో రూపొందిన మూవీ `రజాకార్‌`. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో ప్రధానంగా ఓ వివాదాస్పద అంశాన్ని చూపించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.


ఇటీవల సినిమా రాజకీయాన్ని పులుముకుంటుంది. పొలిటికల్‌ ఎజెండాతో సినిమాలు తీస్తున్నారు మేకర్స్. జనాల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఎజెండాలను జనంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. `యాత్ర2`, `వ్యూహం`, `రాజధాని` సినిమాలు కావచ్చు, అంతకు ముందు వచ్చిన పొలిటికల్‌ మూవీస్‌ కావచ్చు. ఆ కోవకు చెందినవే. అందులో భాగంగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. మోస్ట్ కాంట్రవర్సియల్‌ కథాంశంతో `రజాకార్‌` అనే మూవీ రూపొందింది. 

స్వాతంత్రం వచ్చాక కూడా నిజం నవాబ్‌.. హైదరాబాద్‌(నైజాం ఏరియా)ని భారత్‌లో కలిపేందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు కొంత కాలం పాటు ఇక్కడ జనాలను చిత్ర హింసలు పెట్టారు. రజాకార్లు అనే ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి జనంపైకి వదిలారు. వాళ్లు చేసిన ఆగడాలు అంతా ఇంతా కాదు. వారికి వ్యతిరేకంగా అనేక కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగాయి. రజాకార్లని తిప్పికొట్టడంలో వాళ్లు కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తమ కేంద్ర బలగాలను రంగంలోకి దించి నిజాం అంతు చూసి హైదరాబాద్‌ని భారత్‌లో కలిపేశారు. 

Latest Videos

తాజాగా రజాకార్ల ఆగడాలను ప్రధాన కథా వస్తువుగా చేసుకుని `రజాకార్‌` అనే మూవీని రూపొందించారు. యాటా సత్య నారాయణ దీనికి దర్శకత్వం వహించగా, బీజేపీ నాయకుడు గూడూరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించారు. ఇందులో సింహా, ఇంద్రజ, అనసూయ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పటికే హిందీ ట్రైలర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 

ఇందులోనూ ప్రధానంగా హైదరాబాద్‌(నిజాం) నవాబ్‌ రజాకార్లతో జనంపై దాడులు చేయించడం చూపించారు. వాళ్లు పెట్టే చిత్ర హింసలను కళ్లకి కట్టినట్టు చూపించారు. అదే సమయంలో ముస్లీంలు, హిందూవులు అనే రెండు వర్గాలను ప్రధానంగా చేసి చూపించారు. నిజాం సాధారణ ప్రజలను హిందువులుగా పరిగణిస్తూ వారిపై ముస్లీంలు అయిన రజాకార్లు చేసిన అరాచకాలను హౌలైట్‌ చేసి చూపించారు. నిజాం, తెలంగాణ ప్రజలు అనేది కాకుండా హిందూ, ముస్లీంల కోణంలో ఈ సినిమాని తెరకెక్కించారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

ఇందులో హిందూవులుగా పుట్టి బానిసలుగా ఉంటారా? ముస్లీంలుగా మారి రాజసంగా ఉంటారా? అని రజాకార్లు ప్రజలను బెదిరించడం, మగవారిని అనేక హింసలకు గురి చేయడం, అలాగే ఆడవారిని వివస్త్రలను చేసి అరాచకాలకు, ఆగడాలకు పాల్పడటం చూపించారు. హైదరాబాద్‌ని మరో కాశ్మీర్‌ చేయాలనుకోవడం లేదని, ఈ విషయంలో నిజాంతో చర్చలు జరిపేది లేదని, ఇక యుద్ధమే అని అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ డేర్‌ డెసిషన్‌ తీసుకుని నిజాం అంతం చేయడం వంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి.

చాలా వరకు వివాదాస్పద కంటెంట్‌ ఈ సినిమాలో కనిపిస్తుంది. హిందూ, ముస్లీంలు అనే బేధాలను చూపించారు. దీంతో ఇది వివాదంగా మారే అవకాశం ఉంది. ట్రైలర్‌ విడుదలయ్యాక జనం నుంచి రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాని మార్చి 1న విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

Read more: ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌లతో మరో `నాటు నాటు` రేంజ్‌ సాంగ్‌.. `వార్‌ 2` లెక్క వేరేలా ఉందిగా!

Also read: కమల్ హాసన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఇప్పుడు ఇండియన్ 2 కి ఎంత తీసకున్నారు..?
 

click me!