"రారండోయ్ వేడుక చూద్దాం" మూవీ రివ్యూ

Published : May 26, 2017, 09:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
"రారండోయ్ వేడుక చూద్దాం" మూవీ రివ్యూ

సారాంశం

చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం తారాగణం : నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిశోర్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : నాగార్జున అక్కినేని ఏసియానెట్ రేటింగ్- 3/5

కథ...
నాగ‌చైత‌న్య శివ క్యారెక్ట‌ర్ లో న‌టించాడు. ఈ శివకు నాన్న అంటే ప్రాణం. నాన్న‌తో పాటు వైజాగ్ లో బిజినెస్ చూసుకుంటుంటాడు. ఒక రోజు త‌న అన్న‌య్య పెళ్లికి ఓ పల్లెటూరు వెళ‌తాడు. ఆ పెళ్లిలో భ్ర‌మ‌రాంబ‌ను చూస్తాడు. చూసిన వెంట‌నే భ్ర‌మ‌రాంబ ప్రేమ‌లో ప‌డిపోతాడు శివ‌. ఈ భ్ర‌మ‌రాంబ కు నాన్నే లోకం. అన్న‌య్య పెళ్లి అయిపోయిన త‌ర్వాత శివ వైజాగ్ వెళ్లిపోయినా…భ్ర‌మ‌రాంబే గుర్తుకువ‌స్తుంటుంది. దీంతో భ్ర‌మ‌రాంబ‌ను చూడ‌డానికి శివ‌ ఊరు వెళ‌దాం అనుకుంటాడు. ఇంత‌లో…భ్ర‌మ‌రాంబ ఎంబిఎ చ‌ద‌వ‌డం కోసం వైజాగ్ వ‌స్తుంది. ఆత‌ర్వాత శివ‌, భ్ర‌మ‌రాంబ వైజాగ్ లో క‌లుస్తారు. ఇక అక్క‌డ నుంచి భ్ర‌మ‌రాంబ‌కు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు శివ‌.

అయితే…భ్ర‌మ‌రాంబకు త‌న నాన్న‌మ్మ చిన్న‌ప్ప‌టి నుంచి పెళ్లి చేసుకోవ‌డానికి ఆకాశం నుంచి రాజ‌కుమారుడు వ‌స్తాడు అంటూ క‌థ చెప్పేది. అలా చెప్పిన‌ప్ప‌టి నుంచి త‌న కోసం రాజ‌కుమారుడు ఎక్క‌డ నుంచో వ‌స్తాడు అనుకుంటుంది కానీ…త‌న ప‌క్క‌నే త‌న‌ని రాజకుమారిలా చూసుకుంటున్న శివ‌ను ప‌ట్టించుకోదు. అయితే ఓ రోజు శివ భ్ర‌మ‌రాంబ‌తో ప్రేమిస్తున్నాను అని మ‌న‌సులో మాట చెప్పేస్తాడు. భ్రమల్లో బతికే బ్రమరాంబ శివ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. కోపం వచ్చి ఊరు వెళ్లిపోతుంది. త‌న బావ‌ని పెళ్లి చేసుకోవ‌డానికి ఓకే చెప్పేస్తుంది. అప్పుడు తెలుస్తుంది భ్ర‌మ‌రాంబ‌కు త‌న మ‌న‌సులో శివ ఉన్నాడ‌ని… ఈ విషయాన్ని భ్ర‌మ‌రాంబ నాన్న‌కు చెబితే పెళ్లికి నో అంటారు. కూత‌రు ఏది కావాలంటే అది ఇచ్చే భ్ర‌మ‌రాంబ తండ్రి…కూతురు పెళ్లికి నో చెప్ప‌డానికి కార‌ణం ఏమిటి..? తన నాన్న ఆది(సంపత్) కు, కృష్ణ (జగపతిబాబు)కు ఉన్న స్నేహం, శత్రుత్వం ఏంటి. తన తండ్రికి శత్రువులుగా ఉన్న ఆది కూతురితో ప్రేమలో పడిన శివ ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు? శివ ప్రేమను భ్రమరాంబ ఎలా అర్థం చేసుకుంది. కృష్ణ, ఆది స్నేహాన్ని దెబ్బ తీసిన మూడో వ్యక్తి ఎవరు. చివరకు శివ, భ్రమరాంబలు రారండోయ్ మా పెళ్లి వేడుకకు అని అందర్నీ ఆహ్వానించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా.

.

నటీనటులు...
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మాస్ ఆడియన్స్‑కు దగ్గరైన నాగచైతన్య మరోసారి తన మార్క్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మెప్పించాడు. నటుడిగానూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా భ్రమరాంబతో విడిపోయే సన్నివేశాల్లో నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ సూపర్బ్‑గా ఉంది. హీరో నాగచైతన్యే అయినా కథ అంతా రకుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లుక్స్ పరంగా పల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్‑లో కంటతడి పెట్టించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు, సంపత్‑లు మరోసారి తమ మార్క్ చూపించారు. వెన్నెల కిశోర్ కామెడీతో అలరించాడు.

సాంకేతిక నిపుణులు...
ముందు నుంచి నిన్నేపెళ్లాడతా స్థాయి సినిమా అంటూ ప్రచారం చేసినా దర్శకుడు ఆ స్థాయిని అందుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాడు. రొటీన్ కథతో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం ఎక్కడా నిన్నే పెళ్లాడతా రేంజ్ సినిమాగా కనిపించదు. ఫస్ట్ హాప్ అంతా హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలతో నడిపించేసిన దర్శకుడు చాలా వరకు బోర్ కొట్టించాడు. సెకండాఫ్‑లో అసలు కథ మొదలైన తరువాత మాత్రం సినిమా ఎక్కడా పట్టు తప్పకుండా ఎమోషనల్‑గా సాగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగున్నా.. విజువల్‑గా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్..

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న, మంచి ట్విస్టును ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు.

ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగచైతన్యకు, జగపతి బాబుకు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం, సంపత్ కు, రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని కాస్త బలంగానే రాశారు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవి శ్రీ పాటలు విజువల్స్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్..

సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది.

ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది. సినిమా కథ. కథనాలు కూడా ‘నిన్నేపెళ్లాడుతా, పండగ చేస్కో’ వంటి సినిమాల్ని తలపించాయి. ఇక రిలీజ్ కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్ తో చాలా వరకు గల్లంతయ్యాయి.

చివరగా...

రారండోయ్ వేడుక చూద్దాం.. కుటుంబమంతా సరదాగా కలిసి చూడదగ్గ వేడుక

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్