నా హక్కును నేను కాపాడుకుంటా.. వర్మ

Published : Dec 03, 2016, 10:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నా హక్కును నేను కాపాడుకుంటా.. వర్మ

సారాంశం

వివాదాస్పదంగా మారిన వంగవీటి మూవీ ఇద్దరు పెద్దలు సతాయిస్తున్నారంటున్న వర్మ అయినా తన హక్కులు కాపాడుకోవటానికి పోరాడతానన్న వర్మ

వాస్తవ జీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి సంచలనాలు సృష్టించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. విజయవాడలో వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే రంగా కుమారుడు రాధాకృష్ణ, రంగా సతీమణి రత్నకుమారి కొన్ని అభ్యంతరాలు తెలుపుతున్నారు.

 

దీంతో విడయవాడలోనే వంగవీటి సినిమా ఆడియో విడుదల చేస్తానన్న వర్మ అందుకు తగ్గట్టుగానే... ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక హైకోర్టు కూడా వంగవీటి సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలపై అభ్యంతరం తెలపడంతో కమ్మ కాపు సాంగ్ సోషల్ మీడియా సైట్స్ లోంచి తీసేస్తామని వర్మ టీం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంతటితో వివాదం సద్దుమణగలేదు.

 

వర్మ రూపొందించిన వంగవీటి మూవీకి సంబంధించి ఇప్పటికే రంగా కుటుంబసభ్యులతో వర్మ చర్చించారు. అయితే.. రంగా కుటుంబ సభ్యులు మూవీలోని కొన్ని అంశాలపై అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో వర్మ మూవీ వంగవీటి రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయి.

 

సినిమాని ధైర్యంగా తెరకెక్కించడం.. అంతే ధైర్యంగా దాన్ని విడుదల చేయడం రామ్‌గోపాల్‌ వర్మకి మామూలే. కానీ, 'వంగవీటి' విషయంలో మాత్రం వర్మకి ఇదివరకటిలా పరిస్థితులు అనుకూలించడంలేదు.'వంగవీటి' కాస్త పెద్ద వివాదమే అయ్యింది. నిజానికి, గత వివాదాలతో పోల్చితే 'వంగవీటి' వివాదం చిన్నదే. అయినాసరే, వర్మ 'వంగవీటి' విషయంలో ఎందుకో కాస్త మెట్టు దిగక తప్పడంలేదు. 

 

గతంలో ఎన్నడూ లేని విధంగా 'క్షమాపణ' చెప్పినంత పని చేశాడు వర్మ. దానికి తోడు తాజాగా, 'వంగవీటి'పై నెలకొన్న అనుమానాల్ని నివృత్తి చేసేందుకు పడరాని పాట్లూ పడుతున్నాడు. 'వంగవీటి'లో ఏ కులాన్నీ తక్కువ చేసి చూపించలేదనీ, అసలు కులాలకు సంబంధించిన సినిమా కానే కాదని వర్మ చెప్పుకొచ్చాడు.

 

అయితే, 'వంగవీటి'కి సంబంధించిన ఓ పాటలోనే వర్మ, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నాడో చెప్పేశాడు. 'కమ్మ, కాపు..' అంటూ ఆ పాట సాగింది. ఆ పాట మీద బేస్‌ అయి సినిమా తీశారా.? సినిమాలోని కథంతా ఆ పాటలోనే చెప్పేశారా.? లేదంటే సినిమా ప్రమోషన్‌కి ఆ పాట వాడుకున్నారా.? కారణాలేవైతేనేం, ఆ పాట వర్మని ఇబ్బందుల పాలు చేసింది. ఆ పాటని కోర్టు జోక్యంతో తీసేశారు.. అయినా వర్మని, వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. వంగవీటి మూవీకి కులాలతో సంబంధం లేదని వర్మ చెప్పడం ఆశ్చర్యకరమే. 

 

బెజవాడలో ఎవర్ని కదిలించినా చెబుతారు వంగవీటి అంటే ఏంటో. ఆ వంగవీటికి దేవినేనితో వున్నదేంటో బెజవాడలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ తెలుసు. 'కులాల కుంపటి' కాదని వర్మ చెప్తున్నా, ఆ ఫ్లేవర్ లేకుండా వర్మ 'వంగవీటి' సినిమాలో చూపించడానికేమీ వుండదు. సినిమా విడుదలకు ముందే వివాదాలు సబబు కాదని వర్మ చెబుతున్నా, సినిమా విడుదలయ్యాక చేయడానికేముంటుంది? అందుకే వర్మకి, గతంలో కన్నా ఈసారి గట్టిగానే షాక్‌లు తగులుతున్నాయి.

 

అయితే వర్మ మాత్రం తాను రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నాడు. వంగవీటి ఫ్యామిలీతో చర్చలు సఫలం కాలేదని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అభ్యంతరాలు చెప్తున్నారని, అయితే రాధా రంగా మిత్ర మండలి సభ్యులు తనకు మద్ధతునిస్తున్నారని వర్మ తన ట్విట్టర్ పేజ్ లో పేర్కొన్నాడు. ఎవరు ఏమన్నా, ఎన్ని అభ్యంతరాలు తెలిపినా... తనహక్కులు కాపాడుకోవటానికి తాను పోరాడక తప్పదని, ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కులు కాపాడుకోవడంలో రాజీ పడే ప్రసక్తే లేదని వర్మ తేల్చి చెప్తున్నారు.

 

మొత్తానికి వివాదాస్పదమైన ఈ చిత్రం ఆడియో విజయవాడలో ప్రశాంతంగా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఆడియో రిలీజైనా... మూవీ రిలీజ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా