
సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ చిత్రం వివాదాలు, సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇండియాలో పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేరళ స్టోరీ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఏకంగా 200 కోట్ల దిశగా పయనిస్తోంది. ఈ చిత్రంపై అనేక విమర్శలు, ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి.
అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపిన సంగతి తెలిసిందే.
కేరళలో మహిళలని ట్రాప్ చేసి ముస్లింలు గా కన్వెర్ట్ చేసి ఆ తర్వాత బలవంతంగా ఉగ్రవాద సంస్థలకు తరలించే దారుణమైన చర్య చాలా కాలంగా జరుగుతోందనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇది ఒక ప్రాపగాండా చిత్రం మాత్రమే అని ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కేరళ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించడం విశేషం. ఎప్పటిలాగే వర్మ షాకింగ్ కామెంట్స్ చేస్తూ సెటైర్ జోడిస్తూ కేరళ స్టోరీపై స్పందించాడు. మనకి మనం, ఇతరులకు అబద్దాలు చెప్పడం అలవాటైపోయింది. ఎవరైనా ముందుకు వచ్చి ధైర్యంగా నిజాలు చెబితే మాత్రం షాక్ అవుతాం. కేరళ స్టోరీ చిత్రం ఇంతటి విజయం సాధించడంతో బాలీవుడ్ చనిపోయి మౌనం పాటిస్తున్నట్లు ఉంది.
కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రశంసిస్తూ వర్మ బాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్స్ చేశారు. కేరళ స్టోరీ చిత్రం చనిపోయిన బాలీవుడ్ అగ్లీ ఫేస్ ని చూపించే అద్దం అని ట్వీట్ చేశారు. కేరళ స్టోరీ చిత్ర విజయం చాలా రోజుల పాటు బాలీవుడ్ ని వెంటాడుతుంది. కేరళ స్టోరీ లాంటి చిత్రాల నుంచి నేర్చుకోవడం కష్టం ఎందుకంటే అబద్దాలు కాపీ చేయడం సులభం.. నిజాలని కాపీ చేసి చూపించడం చాలా కష్టం అని వర్మ ట్వీట్ చేశారు.