అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం కథే “వ్యూహం”.. సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ..

Published : Oct 27, 2022, 02:59 PM ISTUpdated : Oct 27, 2022, 03:21 PM IST
అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం కథే “వ్యూహం”.. సినిమాపై  క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) బుధవారం కలిసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్‌‌కు అనుకూలంగా ఆర్జీవీ సినిమా తీయనున్నారనే ప్రచారం కూడా సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) బుధవారం కలిసిన సంగతి తెలిసిందే. తాడేపల్లికి వచ్చిన ఆర్జీవీ.. దాదాపు 40 నిమిషాల పాటు జగన్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జగన్‌‌కు అనుకూలంగా ఆర్జీవీ సినిమా తీయనున్నారనే ప్రచారం కూడా సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను జగన్‌కు అనుకూలంగా సినిమా తీయబోతున్నట్టుగా ఆర్జీవీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు. 

తాను అతి త్వరలో  “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నానని వర్మ ప్రకటించారు. ఇది బయోపిక్ కాదని.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని తెలిపారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిందే “వ్యూహం” కథ అని చెప్పారు. ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని చెప్పారు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన  ఆగ్రహానికి  ప్రతికాష్టే  “వ్యూహం” చిత్రం అని ట్వీట్ చేశారు. 

 


అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.  మొదటి పార్ట్ “వ్యూహం”, రెండో పార్ట్ “శపథం” అని పేరు పెట్టినట్టుగా చెప్పారు. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తెరుకునే లోపే..  వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్  రెండో పార్ట్ శపథం లో తగులుతుందని తెలిపారు. ఆయన తనతో అంతకుముందు వంగవీటి చిత్రం తీశారని తెలిపారు. ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరనీ.. ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని వేరే చెప్పక్కర్లేదని అన్నారు. అందకే ఏం చెప్పడం లేదని పేర్కొన్నారు. 

అయితే వర్మ ప్రకటనను బట్టి ఆయన ఏపీలో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల కుట్రల చేసినప్పటికీ జగన్ వాటిని చేధించారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైన జగన్ ప్రజలకు మంచి చేయాలనే ఆశయంతో ముందుకే సాగారానే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రెండు చిత్రాలను తీశారు. ఇందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2019 ఎన్నికలకు ముందు వచ్చింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించి ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్జీవీతో తీయించారని టీడీపీ ఆరోపించింది. ఈ చిత్రంపై ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్‌తో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రం జగన్‌కు అనుకూలంగా మారిందనే టాక్ కూడా వినిపించింది. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం విడుదలైంది. అయితే ఈ రెండు చిత్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నెగిటివ్ షేడ్‌లో చూపించాయి. 

అయితే ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో మాత్రం జగన్ సర్కార్‌‌పై వర్మ విమర్శలు చేశారు. జగన్‌పై నేరుగా కామెంట్స్ చేయకపోయినప్పటికీ.. కొందరు మంత్రులను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు  గుప్పించారు. ఆ తర్వాత స్వయంగా మంత్రులను కలిసిన ఆర్జీవీ వారితోనే చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ ఉన్నట్టుండి సీఎం జగన్‌ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్