
ఎవ్వరూ ఊహించని విధంగా సర్ప్రైజింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె, ఆమె భర్త రణ్వీర్ సింగ్ కనిపిస్తున్నారు. వీరితో పాటు చెన్నై చిన్నది త్రిష కూడా ఉండడం విశేషం.
ఊహించని విధంగా ఈ క్రేజీ కాంబినేషన్ ఏంటి అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. స్వయంగా రణ్వీర్ సింగ్ ఈ వీడియో షేర్ చేశారు. షో మీ ది సీక్రెట్ అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ.. త్వరలో బిగ్ రివీల్ ఉండబోతోంది అని ఉత్కంఠ పెంచారు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. దీపికా పదుకొనె తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. ఇంతలో రణ్వీర్ సింగ్.. సార్ టార్గెట్ కనిపించింది అంటూ బయలుదేరుతాడు.. వెంటనే ఏజెంట్ గో గో అంటూ రాంచరణ్ కి ఆర్డర్స్ వస్తాయి. దీనితో చరణ్ ఎవరినో ఛేజ్ చేస్తూ వేగంగా పరిగెత్తడం చూడొచ్చు.
అంతలో త్రిష కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తుంది. అసలు ఇదంతా ఏంటి.. ఈ బిగ్ స్టార్స్ అంతా కలసి ఏం చేస్తున్నారు అంటూ నెటిజన్లు వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం వీరంతా ఓ యాడ్ షూట్ కోసం ఇలా కలసి నటించినట్లు తెలుస్తోంది. త్వరలో కంప్లీట్ వీడియో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ లో ఒక సినిమా పడితే అదిరిపోతుంది అని అంటున్నారు. రణ్వీర్ సింగ్ ఇండియాలోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్నాడు. అందరి స్టార్స్ కంటే యాడ్స్ ద్వారా రణ్వీర్ సింగ్ సంపాదనే ఎక్కువ. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ కూడా బ్రాండింగ్ విషయాల్లో టాప్ లీగ్ లోకి చేరుకున్నాడు.
రాంచరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో నటించాల్సి ఉంది.