
గత కొన్ని వారాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది.అనేక ప్రశంసలు పొందింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలు దోచుకుంది. అవన్నీ ఒకెత్తయితే ఇది ఒక్కటీ మరో ఎత్తు.. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన 'నాటు నాటు' పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది.
దీనితో కీరవాణి, చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. కీరవాణి తన సంతోషాన్ని వేదికపై పంచుకున్నారు. ఆస్కార్ అవార్డు వేడుక జరుగుతున్న డాల్బీ థియేటర్ లో బాల్కనీలో ఆర్ఆర్ఆర్ టీం కూర్చుని ఉన్నారు.
ఆస్కార్ అవార్డు ప్రకటించగానే అందరూ ఎగిరి గంతేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ అయితే కేరింతలు, చప్పట్లు కొడుతూ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆల్ రైట్.. యు గాయ్స్ రెడీ.. ఆర్ఆర్ఆర్ అంటూ ప్రజెంటర్ ప్రకటించగానే డాల్బీ థియేటర్ హోరెత్తిపోయింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కి ఎంత క్రేజ్ ఉందో అని.
అవార్డు ప్రకటించగానే చరణ్, ఎన్టీఆర్ హగ్ చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి అయితే చిన్న పిల్లాడిలా అయిపోయారు. తన భార్యని రామారాజమౌళిని గట్టిగా హగ్ చేసుకున్నారు. అలాగే కార్తికేయ గాల్లోకి పంచ్ లు విసురుతూ.. గట్టిగా అరుస్తూ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశం నలుమూలల నుంచి రాజమౌళి అండ్ టీంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.