
టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇటీవలే ఓ బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అయ్యారీతో అలా బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది.
తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రకుల్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ రకుల్‌కి కలిసొచ్చిందో ఏమో తెలీదుకానీ కేంద్ర ప్రభుత్వం ఆమెని తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 'బేటీ బచావో, బేటీ పడావో' పథకాన్ని ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్ సింగ్ తనకొచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తంచేసింది. తన నియామకాన్ని ఓ గౌరవంగా భావిస్తానని పేర్కొన్న రకుల్‌ప్రీత్ సింగ్.. సమాజంలో మార్పు మొదలవడానికి కృషిచేద్దాం అంటూ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుందామె.
రకుల్‌ప్రీత్ సింగ్ స్వస్థలం ఢిల్లీనే అయినప్పటికీ.. ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడటమే కాకుండా ఇటీవలే హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఫిట్‌నెస్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా తాను చివరిగా హైదరాబాద్‌లోనే స్థిరపడతానని స్పష్టంచేశారామె.