సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలతో ఆ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన లైనప్ లోని చిత్రాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈక్రమంలో రజనీకాంత్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే త్వరలో తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు 170కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో సినిమాల నుంచి తప్పుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ (Mysskin) తాజాగా చేసిన వ్యాఖ్యలతోనే ఈ న్యూస్ కు కారణమని తెలుస్తోంది. రీసెంట్ గా మిస్కిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరి కాంబోలో సినిమా ఫిక్స్ అయితే బహుషా అదే రజనీ చివిరి సినిమా కావచ్చు‘ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. రజనీ ఫ్యాన్స్ ఈ వార్తను ఒప్పుకోవడం లేదు. ఆయన అలాంటి నిర్ణయం తీసుకోరని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మిస్కిన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ’లియో‘ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ దళపతి - త్రిష జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిస్కిన్ రజనీ చివరి సినిమా లోకేష్ తోనే అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ ’జైలర్‘ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కథానాయిక. అలాగే కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలోని ’లాల్ సలామ్‘లోనూ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. దీని తర్వాత లైకా ప్రొడక్షన్స్ లో తలైవా174 కూడా రానుంది. ఆ తర్వాత లోకేషన్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. మున్ముందు దీనిపై ఎలాంటి సమాచారం అందుతుందో చూడాలి.