
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి గేహానా వశిష్ట్ సైతం అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆమె మూడు కేసుల్లో ఇరుక్కోవడంతో అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. గత వారమే ఈ పిటిషన్ దాఖలు చేయగా, మంగళవారం విచారణకు వచ్చింది.
జస్టీస్ ఎస్‌ఎస్ షిండే, జస్టీస్ ఎన్జే జమదార్ ఈ బెయిల్ పిటిషన్‌ని విచారణకు స్వీకరించారు. ఈ పిటిషన్‌లో గేహానా పేర్కొంటూ, `ఈ కేసుకి సంబంధించి రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లలో తాను నాలుగు నెలలు కస్టడీలో ఉన్నానని, బెయిల్‌పై బయటకు వచ్చానని తెలిపింది. కేసుకు సంబంధించి మూడో ఎఫ్‌ఐఆర్‌లో ముంబయి పోలీసులు తనని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారని గెహానా తరఫున న్యాయవాది అభిషేక్ యెండే కోర్ట్ కి వివరించారు. ఈ అరెస్ట్ నుంచి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
తన కస్టోడియల్ ఇంటరాగేషన్ ఇక అవసరం లేదని, చాలా తక్కువ సమయంలో, చిన్న ఆరోపణలను ఆధారంగా చేసుకుని తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. దీన్నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంది. గత రెండు ఎఫ్‌ఐఆర్‌లలో తాను బెయిల్‌పై పొందానని, మూడో ఎఫ్‌ఐఆర్ లోనూ బెయిల్ ఇప్పించగలరని తన పిటిషన్‌లో నటి పేర్కొంది. ఈ బెయిల్ పిటిషన్ ఈ నెల 26న అంటే గురువారం విచారణకు రానుంది.