కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్ అభిమానులను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ఫస్ట్ టైమ్ ఆమెసోషల్ మీడియాలోకి అడుగుపెడుతూ పునీత్‌ని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని పంచుకున్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) భార్య అశ్విని రాజ్‌కుమార్(Ashwini Rajkumar) ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఫస్ట్ టైమ్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేసిన మరీ తనలోని బాధని, అభిమానులు చూపిస్తున్న ప్రేమని తెలియజేసింది. తన మొదటి పోస్ట్ ని Puneeth Rajkumarకి అంకితమిచ్చినట్టు తెలిపింది. తన ఇన్‌స్టాలో ఆమె పేర్కొంటూ, పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్నాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ని పవర్‌స్టార్ చేసిన అభిమానులకు పునీత్ లేని లోటు ఊహించడం కష్టమే. ఈ భాదలో మీరు మనో నిబ్బరం కోల్పోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కి అంతిమ వీడ్కోలు పలికారు.
సినీ ప్రియులు మాత్రమే కాదు, ఇండియాలోపాటు విదేశాల నుంచి కూడా పునీత్‌కి నివాళ్లు అర్పించేందుకు వచ్చారు. పునీత్‌ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు` అని పేర్కొంది పునీత్ భార్య అశ్విని. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కన్నడనాట పవర్ స్టార్‌గా, అభిమానులు ముద్దుగా `అప్పు`గా పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ గత నెల(అక్టోబర్) 29న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణం కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ఇండియన్ సినిమా షాక్‌కి గురైంది. యంగ్ ఏజ్‌లో ఆయన గుండెపోటుకి గురవడం దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన లేడనే వార్తని తట్టుకోలేక 21 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. సినిమాలకు అతీతంగా పునీత్ చేసిన సేవా కార్యక్రమాలే ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసిందని, రియల్ లైఫ్‌లోనూ హీరోని చేసిందని చెప్పొచ్చు.
పునీత్ రాజ్‌కుమార్..బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ చిత్రాల్లో నటిస్తూ బాలనటుడిగా ఎదిగారు. తండ్రి జాడలో ఎదుగుతూ హీరోగా మారారు. `అప్పు` సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది తెలుగులో వచ్చిన `ఇడియట్`కి రీమేక్ కావడం ఓ విశేషమైతే, దీనికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న పునీత్ రాజ్‌కుమార్ నటించిన తక్కువ సినిమాలే అయినా కన్నడ నాట తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.