
టాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను ఆగస్టు 1వ తేదీ నుంచి నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని.. ఈ మేరకు త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ స్పందించారు. షూటింగ్‌లు ఆపే ప్రసక్తే లేదన్నారు. పలు అంశాలపై నిర్మాతలంతా కూర్చుని చర్చిస్తున్నట్టుగా చెప్పారు. షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై చర్చించామని తెలిపారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయంపైనా కూడా చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పారు. అలాగే ఓటీటీలో చిత్రాల విడుదలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించామని దిల్ రాజ్ చెప్పారు.
కోవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో మంచి రెస్పాన్స్ వచ్చిన కొన్ని చిత్రాలు.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. మరోవైపు థియేటర్‌లో రిలీజ్ అయిన కొద్ది వారాలకే సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలుగు చిత్రాల నిర్మాణ వ్యవయం, ఓటీటీ ప్రభావంపై గత కొద్ది రోజులుగా నిర్మాతలు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దిల్ రాజు నిర్మించిన `థ్యాంక్యూ` సినిమా ఈ నెల(జులై) 22న విడుదల కానుంది. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించారు. విక్రమ్ కుమార్ రూపొందించారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో దిల్‌రాజు సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన తన సినిమా ప్రత్యేకత గురించి వివరించారు. ఓ సాధారణ కుర్రాడు లెజెండరీగా ఎదిగిన తీరు,ఈ క్రమంలో ఆయనకు ఎవరెవరు సహాయపడ్డారు, వారందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పే చిత్రమిది. లైఫ్ జర్నీని ఆవిష్కరిస్తుంది. చాలా ఎమోషనల్‌గా సాగుతుందన్నారు.
ఈ క్రమంలోనే ఆయన చిత్ర పరిశ్రమపై స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయిందన్నారు. జనం థియేటర్‌కి రావడం లేదని, పెద్ద సినిమాలకు తప్పితే, ఓ మోస్తారు చిత్రాలను కూడా చూడటం లేదని ఆవేదన చెందారు. ఆడియెన్స్ మైండ్ సెట్ మారిందని, ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు, మేకర్స్ మారాలని తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలు, ఓటీటీ, వీపిఎఫ్ ఛార్జీలు, టికెట్ రేట్లు, ప్రొడక్షన్ కాస్ట్, కార్మికుల వేతనాలు, ఇలా అన్ని సమస్యలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ నెల 21న మీటింగ్ నిర్వహించబోతుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించిన నేపథ్యంలో అందులో అనేక విషయాలను చర్చించబోతున్నట్టు దిల్‌రాజు తెలిపారు. ఇండస్ట్రీలో అనూహ్య మార్పులు వస్తాయని తెలిపారు.