
డార్లింగ్, పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ఓ సినిమాని చూసి ప్రశంసించడం చాలా అరుదు. తాజాగా ఆయన కన్నడ సినిమా `కాంతార`పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు రెండు సార్లు ఆ సినిమాని చూశానని తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. `కాంతార`ని రెండో సారి చూశాను. అద్భుతమైన అనుభూతినిచ్చింది. గొప్ప కథ, థ్రిల్లింగ్ క్లైమాక్స్. కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది` అని పేర్కొన్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కన్నడ మార్కెట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో అంతగా ప్రచారం జరగలేదు. ఇటీవల ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. తెలుగులో డబ్ చేసి రేపు(అక్టోబర్ 15)న సినిమాని విడుదల చేయబోతున్నారు.
సెప్టెంబర్ 30న విడుదలై ఆల్‌రెడీ కన్నడలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కావడం తెలుగులోనూ ఇప్పుడు అంచనాలు పెరిగాయి. పైగా ప్రభాస్ దీనికి సపోర్ట్ చేయడంతో ప్రమోషన్ పరంగా మరింత కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. `కేజీఎఫ్` చిత్రాలను, ఇప్పుడు ప్రభాస్‌తో `సలార్`ని నిర్మిస్తున్న హోంబలే ప్రొడక్షన్ ఈ `కాంతార` సినిమాని నిర్మించడంతో ప్రభాస్ ప్రమోషన్‌లో భాగమయ్యారు. తనవంతు ప్రమోషన్ చేసి పెట్టారు. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు.`
`కాంతారా` అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు."కాంతారా" చిత్రం రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంద`ని అల్లు అరవింద్ తెలిపారు.