
ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ టీజర్ లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేసింది. టీజర్ రిలీజ్ కి మూడు రోజుల ముందే ఇలా ఆన్ లైన్ లో లీక్ కావడం బిగ్ షాక్ అనే చెప్పాలి. జూన్ 16, 2025న టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కొద్దిపాటి విజువల్స్‌తో పాటు సుమారు 20 సెకన్ల వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్ర యూనిట్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ( ట్విట్టర్) ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ది రాజా సాబ్ నుండి ఏవైనా లీక్ అయిన వీడియోలు లేదా కంటెంట్ ను షేర్ చేసిన యూజర్లపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలాంటి అకౌంట్లను తక్షణమే సస్పెండ్ చేస్తాం. ప్రేక్షకులు సహకరించి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ను కాపాడేందుకు తోడ్పడాలని కోరుతున్నాం. బాధ్యతతో వ్యవహరించండి” అంటూ హెచ్చరించింది.
ఇప్పటికే ఈ చిత్ర రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ప్రమోషన్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి. దీనితో ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న టీజర్ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సరికొత్త లుక్‌లో చూపించే ఈ టీజర్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి రేపుతోంది. కానీ లీక్ అయిన క్లిప్‌తో ఆ ఆసక్తి కొంత మేరకు దెబ్బతిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్ లీక్ కావడంతో కొందరు అభిమానులు చిత్ర యూనిట్ ని దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజాసాబ్ చిత్రం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్న చిత్రం. అంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న మూవీ విషయంలో చిత్ర యూనిట్, నిర్మాణ సంస్థ చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. చిత్ర యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే టీజర్ లీక్ అయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఈ చిత్రానికి సంభవించిన మొదటి లీక్ కాదు. గతంలో నటి మాళవిక మోహనన్ చేసిన స్టంట్ సీక్వెన్స్ వీడియోలు, కొంత బిహైండ్-ద-సీన్స్ చిత్రాలు కూడా లీక్ అయ్యాయి.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ మేళవింపుతో రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జయరాం, అనుపమ్ ఖేర్, జరీనా వహాబ్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి నటులు సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.
చిత్రానికి సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది.