
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వివిధ బాధ్యతలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినీ షూటింగ్‌లలో పాల్గొంటూ, మరోవైపు ప్రభుత్వ పరంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఓజి, హరిహర వీరమల్లు చిత్రాల షూటింగ్స్ ని ఇటీవలే పవన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ మధ్యలో తన వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కోసం పటాన్‌చెరులోని ఇక్రిసాట్ (ICRISAT – International Crop Research Institute for the Semi-Arid Tropics) క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పాఠశాలకి వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మార్క్ శంకర్ గత విద్యాసంవత్సరం వరకు సింగపూర్‌లో చదువుతున్నారు. అయితే, అక్కడ జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ కి తరలించారు. అప్పటి నుంచి మార్క్ ఆరోగ్యపరంగా క్రమంగా కోలుకుంటున్నాడు. ఇకపై మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే ఉండి చదువుకునేలా పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తన కొడుకు అడ్మిషన్ కోసం ఇక్రిశాట్ కి చెందిన ఇంటర్నేషనల్ పాఠశాలకి పవన్ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధిత అడ్మిషన్ ప్రక్రియలపై చర్చలు జరిపినట్లు తెలిసింది.
ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
మార్క్ శంకర్ సింగపూర్ లో గాయపడినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ ఇకపై హైదరాబాద్ లోనే ఉంటే బాగోగులు చూసుకోవడానికి వీలుగా ఉంటుందని పవన్ అతడి స్కూల్ మార్చుతున్నట్లు సమాచారం.