‘ఆదిపురుష్’ రిలీజ్ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోపై ప్రేమను రకరకాలుగా చూపిస్తున్నారు.
భారీ అంచనాలతో ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం కావడంతో థియేటర్లన్నీ రామాలయాలను తలపిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు చక్కగా ముస్తాబు చేశారు. సినిమా హాళ్ల వద్ద సంబురాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
అయితే, ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది తెలిసిందే. ఇక ఇవ్వాళ Adipurush రిలీజ్ సందర్భంగా ఉదయం నుంచి థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు. భారీ కటౌట్లను ఏర్పాటు చేయడం నుంచీ తొలిరోజు సినిమాను విజయవంతం చేసేంత వరకు ఫ్యాన్స్ తమవంతు కృషి చేస్తున్నారు. టపాసులు పేల్చి సంబురాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ అభిమానుల హవానే కనిపిస్తోంది.
ఈక్రమంలో ప్రభాస్ పై ఉన్న ప్రేమను ఓ అభిమాని వినూత్నంగా చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వారు కొందరు అభిమానం అంటుంటే.. మరికొందరు మాత్రం కాస్తా అతిగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం చేశాడనే విషయానికొస్తే.. ఓ అభిమాని ’జై రెబల్ స్టార్’ అంటూ పగిలిన బీరు బాటిల్ తో చేయిని పదే పదే కోసుకున్నాడు. అతని రక్తంతో ప్రభాస్ పోస్టర్ కు రక్తతిలకం దిద్దాడు. పక్కనే ఉన్న వారు వీడియో తీయడంతో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే, సినిమా చూశామా? ఎంజాయ్ చేశామా? అన్నట్టుగా ఉండాలని.. తమ అభిమాన హీరోపై ప్రేమను చాలా మార్గాల్లో చూపించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయి కోసుకోవడం ఏంటని తిట్టిపోస్తున్నారు కూడా. ఏదేమైనా ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీసిరీస్ బ్యానర్ లో నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. చిత్రం ఫస్ట్ హాఫ్, రామ, రావనుడి మధ్య యుధ్ద సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలుపుతున్నారు. 3డీలో సినిమా అదిరిపోయే అందంటూ ఆడియెన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.