రావణుడు ని చూపించిన విధానం చాలామందికి నచ్చని విషయం అందరికి తెలిసిందే. ఒక వింత పక్షి పై వికృతమైన గెటప్ లో రావణుడ్ని దర్శకుడు ఓం రౌత్ చూపించాడు
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు భారీ ఎత్తున విడుదలయ్యింది. సినిమా విడుదల కాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా సినిమాలో కనిపిస్తున్న రావణాసురుడు పాత్రను చిత్రీకరణను ఎత్తిచూపుతూ.. మన పురాణాలను వక్రీకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో కృత్రిమంగా కనిపిస్తున్నారని అంటూ చాలా మంది యూజర్లు కామెంట్లు చేశారు. తలపై నిక్కబొడుచుకున్న జుట్టు, పొడవైన గెడ్డం, కాటుక కళ్ళతో సైఫ్ రావణాసురుడి కంటే కూడా అలావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నారని పలువురు విమర్శించారు. ఈ విమర్శలు టీజర్ రిలీజైనప్పుడు వచ్చాయి. సినిమాలో రావణుడి రూపాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరించిన విధానాన్ని కూడా తప్పు పడుతున్నారు. కేవలం గెటప్ లో మాత్రమే కాదు..అతని చేష్టలు కూడా వెగటు పుట్టించాయంటున్నారు.
ఓ సైకో లాగ సీతాదేవి మెడకు కత్తిని పెట్టడం ...సీన్ ని ఏ విధంగా సమర్ధించుకోగలడు దర్శకుడు అని ప్రశ్నిస్తున్నారు. ఇక రావణుడు పాత్ర ఓ పెద్ద అనకొండలాంటి పాము చేత మసాజ్ చేయించుకోవటం కూడా బాగోలేదు అంటున్నారు. "శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు 64 కళల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తి. వైకుంఠాన్ని కాపలా కాసిన జయుడు శాపం పొంది భూలోకంలో రావణునిగా పుట్టారు. ఈ సినిమాలో రావణుడి చిత్రీకరణ తుర్కియే నియంతను తలపిస్తోంది కానీ, రావణుడిని కాదు. బాలీవుడ్! రామాయణాన్ని, చరిత్రను వక్రీకరించడం ఆపుతారా అని గద్దిస్తున్నారు.
అయితే అసలు వాల్మీకి రామాయణం ప్రకారం..రావణుడు ఎలా ఉంటాడు. పురాణాల ప్రకారం రాముడిని ధర్మానికి, సత్యానికి ప్రతీకగా చెప్పబడింది. అలాగే లంకాపతి రావణుడు(Ravan) గొప్ప పండితుడు. సత్వ, రాజ్, తమ అనే మూడు గుణాలు రావణుడిలో ఉన్నాయని చెప్తారు. రావణుడులో తమోగుణం ఎక్కువ, సత్వగుణం తక్కువ. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు.. కైకసి,విశ్రవ మహర్షి కుమారుడు. మూడు శాపాల కారణంగా రావణుడు జన్మించాడని నమ్ముతారు. రావణుడి పుట్టుక వెనుక ఉన్న రహస్యం మరియు రావణుడు బ్రాహ్మణ కొడుకు అయిన తర్వాత కూడా రాక్షస గుణాలను ఎలా పొందాడో కూడా చెప్పబడింది. పరసతి వ్యమోహం, అధర్మ పాలన, దైవ దూషణ, విపరీత కామదాహం లాంటి నీచపు లక్షణాలు వున్న రాక్షసరాజు రావణాసుడు.
"ఇదొక 500 కోట్ల కార్టూన్ సినిమాలా ఉంది. రావణాసురుడు దారుణంగా కనిపిస్తున్నారు. రావణుడు భారతీయునిలా కనిపించడం లేదు. ఆయన కళ్ళకు నీలం రంగు మేక్‌అప్ వేసి, తోలు జ్యాకెట్‌లను ధరింపచేశారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇలా చేయకూడదు. రావణుడి పాత్ర చిత్రీకరణ కోసం భూకైలాస్‌లో ఎన్‌టీ రామారావు పాత్రను, సంపూర్ణ రామాయణంలో ఎస్‌వీ రంగారావు పాత్రలను చూసి ఉండాల్సింది" అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ‘‘రామాయణం ఈ దేశానికి, నాగరికతకు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని ఎవరూ తమకిష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఈ విధమైన చిత్రీకరణతో చాలా విచారంగా ఉంది" అని మరికొందరు అంటున్నారు. . సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటన హైలెట్ గా నిలువగా, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది.