
సినీ నటుడు నందమూరి తారకరత్న మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తారకరత్న అకాల మరణం బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. ‘‘నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం. ఆయన సినిమాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, అభిమానులతో ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక, 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచిన సంగత తెలిసిందే. దీంతో ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఈ తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మోకిలలోని ఆయన సొంత ఇంటికి తరలించారు. దీంతో అక్కడికి చేరుకుంటున్న పలువురు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నటులు మురళీమోహన్, అజయ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక, సినీ ప్రముఖులు తారకరత్నకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు భారీగా ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. నందమూరి అభిమానులు కూడా తమ అభిమాన నటుడిని కడసారి చూసి తుదివీడ్కోలు పలకడానికి భారీగా చేరుకుంటున్నారు.
ఈరోజు మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం ఉంచనున్నారు. అయితే తారకరత్న భౌతిక కాయాన్ని రేపు(సోమవారం) అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.