తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు దంపతుల నివాళులు..

By Sumanth Kanukula  |  First Published Feb 19, 2023, 11:41 AM IST

సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు నివాళులర్పించారు. 


సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్నకు  నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా చంద్రబాబు మాట్లాడారు. విజయసాయిరెడ్డి.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే.

ఇక, 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచిన సంగత  తెలిసిందే. దీంతో ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఈ తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మోకిలలోని ఆయన సొంత ఇంటికి తరలించారు. దీంతో అక్కడికి చేరుకుంటున్న పలువురు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

Latest Videos

తారకరత్నకు ఆయన  సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నటులు మురళీమోహన్, అజయ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక, సినీ ప్రముఖులు తారకరత్నకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు భారీగా ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. నందమూరి అభిమానులు కూడా తమ అభిమాన నటుడిని కడసారి చూసి తుదివీడ్కోలు పలకడానికి భారీగా చేరుకుంటున్నారు. 

ఈరోజు మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం ఉంచనున్నారు. అయితే తారకరత్న భౌతిక కాయాన్ని రేపు(సోమవారం) అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. 

ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర‌లో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన తారకరత్న గుండెపోటుతో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదలయా ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే వచ్చారు. అయితే వైద్యులు తారకరత్నను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచి తారకరత్న శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

click me!