
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటై ఉన్న చిత్రాలని పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వల్ల అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి.
త్వరలో ఏపీలో ఎలక్షన్స్ రాబోతుండడంతో మరో నాలుగైదు నెలల వరకు పవన్ ఫుల్ బిజీగా ఉంటారు. సినిమాలకు డేట్స్ కేటాయించే పరిస్థితి ఉండదు. సెట్స్ పై ఉన్న చిత్రాలు కాకుండా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తయిపోయింది.
ప్రస్తుతం నితిన్ ఎక్స్ట్రా చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్న రచయిత వక్కంతం వంశీ.. పవన్, సురేందర్ రెడ్డి చిత్రానికి కథ అందించారు. ఎక్స్ట్రా ప్రచార కార్యక్రమాల్లో వక్కంతం వంశీ ఈ చిత్రం గురించి ఫస్ట్ లీక్ ఇచ్చారు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయింది. కథ చాలా బాగా ఉంటుంది. అది ఒక సోషల్ సెటైర్ అని వక్కంతం వంశీ అన్నారు.
షూటింగ్ కి ఎప్పుడు వెళుతుంది అనేది ఇక మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది అని అన్నారు. కథ వినగానే కళ్యాణ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళదామా అని ఉందని కళ్యాణ్ గారే స్వయంగా చెప్పినట్లు వక్కంతం వంశి అన్నారు. ఈ చిత్రం షూటింగ్ కి ఎప్పుడు వెళుతుందో కానీ వక్కంతం వంశీ మాటలు పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.