పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. తాజాగా టీజర్ పై అప్డేట్ అందింది. మరోవైపు ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తమ బ్యానర్ లోని చిత్రాలపై మరిన్ని విషయాలను పంచుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కు రీమేక్ గా వస్తోంది. తమిళ స్టార్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనవంతు షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. మరోవైపు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
ప్రస్తుతం ‘బ్రో’ టీజర్ పై అప్డేట్ అందింది. ప్రస్తుతం యూనిట్ టీజర్ కట్ చేసే పనిలో ఉందని తెలిపారు. అయితే సరైన డేట్ ను మాత్రం కన్ఫమ్ చేయలేదు. ఈ నెలలోనే మొత్తానికి విడుదల చేసే ప్లాన్ ఉన్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. వచ్చే నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ముగింపు పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టీరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరింపజేస్తున్నారు. ఇదే బ్యానర్ ద్వారా ‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ ను కొనుగోలు చేశారు. మూడు రోజుల్లో చిత్రం రిలీజ్ కాబోతుండటంతో TG Vishwa Prasad స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ బ్యానర్లో రాబోతున్న చిత్రాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాం. మార్కెట్ లెక్కలు వేసుకుని మంచి ధరకు ఈ సినిమా తెలుగు రైట్స్ ని తీసుకున్నాం. భవిష్యత్ లోనూ టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన ఉంటుంది. 'స్పిరిట్'ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం. ఇక ప్రభాస్ అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో అంత మంచి అనుబంధం ఏర్పడటం మా అదృష్టం.
ఇక మా ప్రొడక్షన్ హౌజ్ నుంచి వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది ఇటీవల పెట్టుకున్న లక్ష్యం. త్వరలోనే మా బ్యానర్ లో 25 సినిమాలు పూర్తవుతాయి. మా మొదటి 25 సినిమాల కోసం మేం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాం. కానీ తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేసి, 50 సినిమాల మార్క్ ని అందుకుంటాం. ఇప్పటికే నాలుగైదు దాదాపు సినిమాలు పూర్తయ్యాయి, మరో 15 దాకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్రియేటివిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు. ఇన్ని సినిమాలు చేయడం వల్ల, విడుదల సమయంలో మాత్రం ఛాలెంజ్ లు ఎదురవుతాయి. మాది ఒక ఫ్యాక్టరీ. మాకు టీం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా.. మంచి సినిమాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం.
పరాజయాలకు, భాగస్వామ్యానికి సంబంధం లేదు. మేం ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన వాటిలో పరాజయంపాలైనవి ఉన్నాయి. అలాగే మేం సోలోగా నిర్మించిన వాటిలోనూ పరాజయం చెందినవి ఉన్నాయి. భాగస్వామ్యంతో చేసినా ఎక్కువ శాతం మా ప్రమేయం ఉంటుంది. కాబట్టి జయాపజయాల్లోనూ మా బాధ్యత ఉంటుంది. ఆ మేరకే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. కేవలం థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు చేస్తామని చెప్పగలుగుతున్నాం.
ఇక ఆదిపురుష్ విషయానికొస్తే.. రేపు(జూన్ 14) ఓపెన్ అవుతాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగింది. రెండు ప్రభుత్వాల సానుకూల స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్ లలో ధరల అలాగే ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. రూ.25 పెంచాలి అనుకుంటున్నాం. ఇతర పంపిణీదారులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాం. అందుకే కాస్త ఆలస్యమైంది. హనుమంతుడికి ప్రతి థియేటర్ లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనం. ఉచిత టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదు. ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వారంతట వారు ముందుకొచ్చి చేస్తున్నారు. ఇక జూన్ 15న రాత్రి ప్రీమియర్స్ వేయాలనే డిమాండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తే చూస్తాం.
ప్రస్తుతం సెట్స్ మీద దాదాపు 15 సినిమాలు ఉన్నాయి. వాటి ప్రకటన, ప్రమోషన్స్ విషయంలో వేటికవే ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులని కూడా పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎనిమిది, పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఇక మా 25వ సినిమా 'బ్రో'Bro. మా 50 వ సినిమా ప్రకటన అనేది మరో ఆరు నెలల్లో ఉండొచ్చు. ఇంత తక్కువ సమయంలో హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది సాధ్యంకాదు. వచ్చే రెండు మూడేళ్ళలో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం అక్కడి టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నాం. త్వరలో పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం.
అలాగే ప్రభాస్-మారుతి సినిమాను ప్రకటించకపోవడంపైనా స్పందిస్తూ.. ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను. అలాగే అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నాం. కానీ కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మేలో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయాం. త్వరలో ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.