
ఈరోజు (24 మార్చ్ ) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన నేతాజీ గ్రంథ సమీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కళ్యాణ్ మాట్లాడుతూ ఎంతో మంది పాలకులు మారుతున్నా గానీ, నేటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నేతాజీ అస్థికలను తెచ్చి ఎర్రకోటలో ఉంచాలన్నారు.
అంతే కాదు ఈ కార్యక్రమం కోసం ప్రజలు కూడా సహకరించాలని, ఆస్థికలను తెచ్చేంత వరకూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). అంతే కాదు ఇది సాధ్యం కావాలి అంటే అందుకు నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి అన్నారు. అప్పుడే ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అస్థికలు తేవాలని డిమాండ్ చేస్తూ రింకోజ్ టు రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆవిష్కరించారు. నేతాజీ సేవలను ఈ దేశం సరిగా గుర్తించలేదన్నారు.
అంతే కాదు ఈ కార్యక్రమలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పవర్ స్టార్. నిన్నకాక మొన్న వచ్చిన వారికి శిలా ఫలకాలు,విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోకపోవడం సిగ్గుచేటన్నారు పవన్(Pawan Kalyan). కనీసం వంద రూపాయల నోటుపైన అయినా నేతాజీ బొమ్మ ఉండేలా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోకుంటే ఈ దేశంలో మనకు ఉండే అర్హతలేదన్నారు. జైహింద్ నినాదాన్ని మొదట తీసుకొచ్చింది నేతాజీ(Netaji Subhas Chandra Bose)నే అని ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్‌ను చాలా మంది విభేదించారని ఆయన చెప్పారు. నేతాజీ సైన్యంలో 70 శాతం మంది దక్షిణ భారత దేశానికి చెందినవారే ఉన్నారన్నారు. సుభాష్ చంద్రబోస్ చనిపోయే చివరి క్షణం వరకూ దేశ స్వాతంత్య్రం కోసం పరితపించిన అంశాన్ని ఆయన చదివి వినిపించారు.
రెంకోజీ ఆలయంలోని విజిటర్స్ పుస్తకంలో ఏదోక రోజు నేతాజీ అస్థికలు భారత్‌కు తీసుకొస్తామని అప్పటి ప్రధాని వాజ్‌పేయి అందులో రాసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.నేతాజీ(Netaji Subhas Chandra Bose) చనిపోయి 77 ఏళ్లు గడుస్తున్నా ఆయన అస్థికలను డీఎన్‌ఏ టెస్టు చేసి ఎందుకు స్వదేశానికి తీసుకురావట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కోరుకుంటే ఇది సాధ్యమవుతుందని, ఆ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నేతాజీ అస్థికలు తెచ్చేందుకు మద్దతు కావాలని ఆయన ప్రజలను కోరారు.