
పవిత్ర లోకేష్, వీకే నరేష్.. యాభై ఏళ్లు దాటిన ఈ ముదురు జంట ఇప్పుడు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. విడాకులు క్లీయర్ కాకపోవడంతో వీరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రేమని వ్యక్తం చేసుకుని, పెళ్లి కూడా చేసుకున్నట్టు వీడియోలు విడుదల చేసి సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చారు. కానీ తీరా చూస్తే అది ఓ సినిమా కోసమని తేలింది. అదే `మళ్లీ పెళ్లి` మూవీ. ఈ ముదురు జంట `మళ్లీ పెళ్లి` పేరుతో ఎంఎస్‌రాజు తీయబోతున్న సినిమాలో కలిసి నటిస్తున్నారు. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. త్వరలో టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న టీజర్ ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో నరేష్ కోట్ ధరించగా, పవిత్ర లోకేష్ చీరలో మెరిసింది. సినిమా పోస్టర్ బ్యాక్ గ్రౌండ్, టైటిల్స్ కలర్, వీరి డ్రెస్ కలర్స్ మ్యాచింగ్‌లా ఉండటం విశేషం. ఈ కొత్త లుక్ ఆకట్టుకుంటుంది. మరి ఈ గురువారం విడుదలయ్యే టీజర్‌లో ఈ ముదురు జంట తమ విశ్వరూపం చూపించబోతున్నారని చెప్పొచ్చు.
ఇక నరేష్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి యాభై ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తన గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఫిల్మ్ గా `మళ్లీ పెళ్లి`ని తెరకెక్కిస్తుండటం ఓ విశేషమైతే, ఇందులో తనకు కాబోయే భార్యతో కలిసి నటిస్తుండటం మరో విశేషం. ఈ సినిమాని ఎంఎస్ రాజు రూపొందిస్తుండగా, విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై వీకే నరేష్ తెలుగు, కన్నడలో నిర్మిస్తుండటం విశేషం. పవిత్ర లోకేష్ కన్నడలో పాపులర్ కావడంతో దీన్ని బైలింగ్వల్‌గా రూపొందిస్తున్నారు. ఈ సమ్మర్‌కి ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు టీమ్ తెలిపింది.
ఇక ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తుండగా, జయసుధ, శరత్ బాబు, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్ యండమూరి, మధు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఎంఎన్ బాల్‌రెడ్డి కెమెరామెన్, జునైడ్ సిద్ధిక్ ఎడిటర్, అనంత శ్రీరామ్ సాహిత్యం అందిస్తున్నారు.