ప్రవర్తన మార్చుకోవాలంటూ బాలకృష్ణకు ఓపెన్ లెటర్

First Published Aug 4, 2017, 4:22 PM IST
Highlights
  • 102వ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి బాలయ్య వీరంగం
  • చెప్పులు విప్పక చూస్తావేంటిరా అని అసిస్టెంట్ తలపై టపీమనిపించిన బాలయ్య
  • దీనిపై పైసా వసూల్ డైలాగులా.. అన్నా.. రెండు గ్రాముల సంస్కారం గావాలన్నా అంటూ లేఖ

సీసీఎల్ లో పబ్లిగ్గా సిగరెట్ తాగినా.., "కొట్టానంటే అయిపోయావే.. అంటూ అభిమానిని బెదిరించినా, ఏంటీ గోల మమ్మల్ని **గెయ్ మంటారా?" అని మీడియా ప్రతినిథులతో అన్నా... అది బాలయ్యకే చెల్లు. తాజాగా బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. రామోజీ ఫిలింసిటీలో జరిగిన తన కొత్త సినిమా జయసింహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు.

 

జయసింహ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాట్ కోసం అంతా రెడీ అయినా.. బాలయ్య రాకపోవడంతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే కాలి చెప్పులు విప్పుకుని ముహూర్తం షాట్ కు వద్దామనుకున్న బాలయ్య.. తనే చెప్పులు విప్పి పక్కకు అంటే అయిపోయేది. కానీ ఆ పని చేయాల్సిన(అదే ఉద్యోగం ఇచ్చారట) బాలయ్య అసిస్టెంట్ కనిపించలేదు. ఇంతలోనే వచ్చేశాడు. అతన్ని తల మీద టపీమని కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు బాలయ్య(అప్పటిదాకా ఎక్కడికో వెళ్లి పరుగు పరుగున వచ్చిన అసిస్టెంట్ వచ్చీ రాగానే బాలయ్య పక్కన నిలుచున్నాడు. ఆ వెంటనే బాలయ్య టపీమని నెత్తిపైన ఒకటి పీకి కాలి చెప్పులు విప్పమని ఆదేశించాడు.)

 

దర్శకుడు కేయస్ రవికుమార్ తో బాలకృష్ణ మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. బాలయ్య హల్ చల్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే బాలయ్యకు షాట్ కు వెళ్లటానికి ఆలస్యం అవుతుందనే అలా చేశారని, అప్పటిదాకా విధులు మరచి అసిస్టెంట్ ఎటు వెళ్లాడో తెలియలేదని, దీనికింత రాద్దాంతం చేయడం అవసరమా అని బాలయ్య అభిమానులు అంటున్నారు.

 

అయితే బాలయ్య ప్రవర్తన మీద ఒక బహిరంగ లేఖ సోషల్ మీడియా లో శరవేగంగా.. సర్కులేట్ అవుతోంది. పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య లేటెస్ట్ మూవీ పైసా వసూల్ స్టంపర్ లోని డైలాగ్ “అన్నా.. రెండు బాల్కనీ టికెట్లు గావాలె” అనే డైలాగును ఇమిటేట్ చేస్తూ... "అన్నా.... రెండు గ్రాముల సంస్కారం గావాలన్నా" అంటూ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

అన్నా.... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..! ఆడది కనబడితే కడుపు చేయమంటావ్, మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్, ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్, ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్. దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం పోయి శానా కాలమైంది. ఇది ప్రజాస్వామ్యం ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవకండి. పొగరు దరి చేరనంతవరకే ఏ కళకైనా విలువ. ఒక కళాకారుడైన మీకు ఇది తగదు.సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు,మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు. మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో. VIP లో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది. తెలుగు తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు మనుష్యుడే నా సంగీతం..మానవుడే నా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే... ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు తాకమని చేయి చేస్కోవు.

 

అతడు పనివాడే కావొచ్చు..కానీ ఒక మనిషేనని గుర్తుంచుకోండి నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు.. సాటి మనిషి మాత్రం..నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21 వ శతాబ్దంలో.. 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా కులం కంపు, జాత్యహంకార కంపు, ధనాహంకార కంపు కొడుతోంది ధన బలం, అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొర్లే పంది వలే వెర్రి తలలు వేస్తుంది. అన్నా.....రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా... ఈ బహిరంగలేఖ బాలకృష్ణగారికి చేరాలని... అంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ తెగ సర్కులేట్ అవుతోంది.

click me!