
ఖడ్గం, మురారి, రాఖీ లాంటి హిట్ చిత్రాలిచ్చిన దర్శకుడు కృష్ణ వంశీ గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు. రీసెంట్ గా మొగుడు, గోవిందుడు అందరి వాడే, పైసా లాంటి చిత్రాలు కృష్ణవంశీ మార్కెట్ కూడా బాగా తగ్గేలా చేశాయి. తన పేరు చెప్పి బిజినెస్ చేసే రేంజ్ నుంచి తన పేరు చూసి బయ్యర్స్ భయపడెంత లెవెల్ కి పడిపోయాడు. అందుకే ఎప్పుడో విడుదల కావాల్సిన నక్షత్రం మూవీ చాలా ఇబ్బందులు పడి.. ఆలస్యంగా రిలీజ్ అయింది. ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా పోలీస్ యాక్షన్, హీరొయిన్ల గ్లామర్ కొంత వరకు యూత్ ని అట్రాక్ట్ చేయడానికి పనికి వచ్చాయి. మరి నక్షత్రం కృష్ణవంశీ నక్షత్రం చుక్కల్లో ఒకటా లేక చుక్కలు చూపించిందా..
కథ :
తరతరాలుగా తన తాతలు తండ్రులు పోలీస్ డిపార్ట్ మెంట్ లో సేవలందిస్తుండటంతో.. తాను కూడా ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు రామారావు(సందీప్ కిషన్). తన మామ కూతురు జమున(రెజీనా)తో ప్రేమలో పడతాడు. మరోవైపు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా చేసే ముస్తాక్ తో చేతులు కలుపుతాడు పోలీస్ కమీషనర్ పరశురామయ్య(ప్రకాష్ రాజ్) కొడుకు రాహుల్(తనీష్). రాహుల్ వల్ల రామారావు(సందీప్ కిషన్)పోలీస్ సెలక్షన్ కు వెళ్ళలేక ఉద్యోగానికి దూరం అవుతాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అయితే అది చూసిన సీతారాం(శివాజీరాజా) వారించి కాపాడతాడు. చట్టాన్ని కాపాడదామని మంచి పనులు చేస్తున్న రామారావుకు అలెగ్జాండర్(సాయి ధరం తేజ్) గురించి తెలియజెప్పి.. చట్టాన్ని కాపాడే సత్తా దంటూ అలెగ్జాండర్ పేరున్న యూనిఫాం ఇస్తాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ లా మంచచి పనులు చేస్తుండే రామారావు.. డ్రగిస్ట్ ముస్తాక్ ని ఎలా పట్టుకున్నాడు, మాయం అయిన ఆఫీసర్ అలెగ్జాండర్ ఎవరు, కమిషనర్ పరుశురామయ్య చివరికి ఏం చేసాడు అనేది మిగిలిన కథ.
నటీనటులు :
హీరోలు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజలు సినిమాకు కలిసొచ్చే అంశం. అసలు స్టార్ కాస్ట్ ఎక్కువగా ఉండటం మెయిన్ ప్లస్ పాయింట్. సందీప్ కిషన్ ఒక్కడినే హీరోగా పెట్టి తీసి ఉంటె ఓపెనింగ్స్ ఎంత దారుణంగా ఉండేవో చెప్పాల్సిన పని లేదు. అందుకే సాయి ధరం తేజ్ లాంటి మెగా ఇమేజ్ ఉన్న హీరోను డంప్ చేశాడు కృష్ణవంశీ.
సందీప్ కిషన్ నుంచి కృష్ణవంశీ బాగా రాబట్టుకున్నాడు. సందీప్ కిషన్ సానబడితే రాటుతేలుతాడని రుజువయ్యింది. సాయి ధరంది హీరో కాని హీరో పాత్ర. తన వంతు ఎఫర్ట్స్ బాగా పెట్టినప్పటికీ పాత్రలో అతని ఇమేజ్ కు తగ్గ దమ్ము లేక తేలిపోయింది. కేవలం కృష్ణ వంశీ మీద గౌరవంతో చేసిన పాత్ర తప్ప నయ పైసా ఉపయోగం లేదు. అసలు ఒక ప్రత్యేకత అంటూ లేని విధంగా సాయిధరమ్ తేజను చూపిన తీరు చూస్తే ఏదో మొహమాటానికి ఆ పాత్ర అంగీకరించాడని చెప్పొచ్చు. ఇక విలన్ గా తనిష్ బాగా చేశాడు కాని ప్రీ క్లైమాక్స్ ముందు అతన్ని కూడా వాడుకోలేదు వంశీ . డ్రగ్స్ బాధితుడిగా నటించలేదు జీవించాడు. ప్రకాష్ రాజ్, శివాజీ రాజ చాల చోట్ల ఓవర్ అయ్యారు. రాజ్యలక్ష్మి అతికి పరాకాష్టగా నిలిచింది. చాలా పాత్రలున్నాయి కానీ ఎవరికి చెప్పుకోదగ్గ స్పేస్ లేదు. ప్రగ్యా జైస్వాల్ ఐపిఎస్ పాత్రలో ఏం సాధించిందో అని ఆలోచిస్తే చిరాకు అనిపిస్తుంది. ఇక రెజినా కూడా అందాలు ఆరబోయడానికేనా అన్నట్లు అనిపించింది.
సాంకేతిక వర్గం :
కృష్ణ వంశీ కథ పరంగా మంచి లైన్ రాసుకున్నాడు. కాని అది తీయటంలో మాత్రం చాలా దారుణమైన పొరపాట్లు చేసాడు. ఒక డిజిపి రేంజ్ ఆఫీసర్ పట్టపగలు బజారులో బాంబు పేలుడులో చనిపోతే ఎవరికి తెలియకుండా డిపార్టుమెంటు మొత్తం ఆచూకి కోసం వెతకడం, ఊరంతా నేరాలు చేసే కమీషనర్ కొడుకు ఘనకార్యాలు తండ్రికి చివరి దాకా తెలియకపోవడం లాంటి ఘోరమైన లాజిక్ లేని సీన్స్ ఇందులో బోలెడు ఉన్నాయి. అన్నిరసాలు ఉండాలి కాబోలు అని దేన్నీ బాలన్స్ చేయలేక మొత్తానికే చేతులు ఎత్తేసాడు కృష్ణ వంశీ.
పైగా రెండున్నర గంటల పాటు హింసకు స్పెల్లింగ్ రాయించాడు. టేక్ ఆఫ్ బాగున్నా ఆ తర్వాత మాత్రం గ్రాఫ్ కిందకు వెళ్ళడమే కాని ఎక్కడ పికప్ కాకపోవడం సినిమాను దెబ్బ తీసింది. సందీప్ కిషన్ ని అడ్డగించి తనీష్ గ్యాంగ్ సర్టిఫికేట్లు కాల్చడం లాంటి ఎపిసోడ్లు కృష్ణ వంశీ మార్క్ టేకింగ్ చూపిస్తాయి. కాని ఆ ఇంప్రెషన్ మొత్తం సెకండ్ హాఫ్ లో పూర్తిగా పోగొట్టుకున్నాడు వంశీ. అక్కడే బాగా తేడా వచ్చింది. ప్రతి పాత్ర ఓవర్ ఎమోషనల్ గా ఉండటం కృష్ణ వంశీ సినిమాల్లో కామన్ అయినా ఇక్కడ స్క్రీన్ ప్లే దారుణంగా ఉండటం వల్ల అది బాగా వెగటు పుట్టిస్తుంది.
ఇక ఐదేసి పాటలు సినిమా ఫ్లోని ఇంకా దెబ్బ తీసాయి. బ్యాక్ గ్రౌండ్ మరీ నాసిరకంగా ఉంది. కెమెరా వర్క్ వరకు పర్వాలేదు అనిపించినా సహనానికి పరీక్ష పెట్టె కథనం కుదురుగా కుర్చోనివ్వదు. నిర్మాత పెట్టిన ఖర్చు భారీగా వృధా అయ్యింది
ప్లస్ పాయింట్స్ :
భారీ స్టార్ కాస్ట్, తనిష్ విలన్ రోల్, సినిమాటోగ్రఫీ
నెగటివ్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లేలో కంగారు, ప్రాధాన్యత లేని సాయి ధరం తేజ్ పాత్ర, లాజిక్స్ గురించి పట్టించుకోకపోవడం , పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
చివరిగా : ఖడ్గంలా అద్భుతంగా తీయాల్సిన స్టోరీతో కంగారులో పగలే “నక్షత్రం”లు చూపించారు.