
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంపర్ దాకా స్టార్ హీరో ఇమేజ్ వున్నా... టెంపర్ తర్వాత తన రేంజ్ మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగిపోయింది. టెంపర్ మూవీతో స్టార్ట్ అయిన ఎన్టీఆర్ విజయ పరంపర జై లవకుశ సినిమాతో వరుసగా నాలుగో సినిమాతో కూడా కంటిన్యూ అవుతోంది. తాజాగా జై లవకుశ సక్సెస్‌ను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్‌తో చేసే సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇప్పట్నుంచే అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌కు ఈ మూడేళ్లలో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. టెంపర్‌కు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు...ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా ఉంది. దీంతో ఎన్టీఆర్ యావరేజ్ సినిమా చేసినా కూడా వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి.
ఇదిలా ఉంటే జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తన ఫ్యూచర్ పాలిటిక్స్‌పై హింట్ ఇచ్చినట్టే కనపడుతోంది. ఈ సినిమాలో రావన్(జై) క్యారెక్టర్ సమసమాజ్ పార్టీ తరపున పోటీ చేస్తాడు. గుర్తింపు ఎవడబ్బ సొత్తు కాదంటూ.. తనకు గుర్తింపు తెచ్చుకునే సత్తా వుందంటూ... ఎన్నికల్లో పోటీకి నిలబడతాడు. ఇక 2009లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ఎన్టీఆర్ అసలైన వారసుడిగా..ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తన బాధ్యతగా అహర్నిశలు తన వంతు కృషి చేసాడు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి టీడీపీకి ఉన్న గెలుపు అవకాశాల్ని గండిగొట్టారు. ముక్కోణపు పోరులో ఎంతోమంది టీడీపీ సీనియర్లు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోవడంతో టీడీపీ ఓడిపోయింది. 2012 తర్వాత ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు ఇటు బాలయ్య, చంద్రబాబుతో గ్యాప్ తీవ్రంగా పెరిగిపోయింది.
కట్ చేస్తే ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు 2019లో మరోసారి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరో వైపు వైసీపీ అధినేత జగన్ వ్యూహకర్తలతో ముందుకు వెళుతున్నాడు. ఇక గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్‌కళ్యాణ్ తన జనసేన ద్వారా కూడా ఒంటరిపోటీకి రెడీ అవుతున్నాడు. పవన్ టీడీపీతో జట్టుకట్టినా అతడు అడిగినన్ని సీట్లు ఇవ్వడం కష్టమే. ఈ క్రమంలోనే చంద్రబాబు అండ్ కో ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇక ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో అతడు చెప్పిన డైలాగులు ఫ్యూచర్‌లో అతడికి రాజకీయాల్లోకి రావాలన్న ఉత్సుకతను చెప్పకనే చెప్పాయి. జైలవకుశ సినిమాలో జై పాత్రలో ఎన్టీఆర్ అధికారం దాహంతో ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు విసురుతూ వుంటాడు. ఏదేమైనా 2019 నాటికి ఎన్టీఆర్ తిరిగి చంద్రబాబు చెంతకు చేరి టీడీపీ తరపున ప్రచారం చేస్తాడన్నదే ప్రస్తుతం ఏపీ టీడీపీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట. అయితే ఎన్టీఆర్ తిరిగి టీడీపీ, చంద్రబాబు చెంతకు చేరేవరకు వీరి మధ్య ఇంటర్నల్ వార్ ఎంతో కొంత నడవడం కన్‌ఫార్మ్‌గా కనిపిస్తోంది.