రివ్యూ: నర్తనశాల

By Udayavani Dhuli  |  First Published Aug 30, 2018, 12:34 PM IST

గతేడాది 'ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి


నటీనటులు: నాగశౌర్య, యామిని భాస్కర్, కాశ్మీర, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ తదితరులు 
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్ 
సంగీతం: మహతి స్వర కుమార్ 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు 
నిర్మాత: ఉషా మూల్పూరి 
దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి 

గతేడాది 'ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాగశౌర్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడో.. లేదో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
 
కథ: 
కళామందిర్ కళ్యాణ్(శివాజీ రాజా) తనకు కూతురు పుట్టాలని కోరుకుంటాడు. చనిపోయిన తన తల్లి మళ్లీ తన కూతురుగా పుడుతుందని నమ్మకంతో ఉంటాడు. కానీ అతడికి అబ్బాయి పుడతాడు. అతడే రాధాకృష్ణ(నాగశౌర్య). తన తండ్రిని బ్రతికించుకోవడం కోసం తనకు కూతురే పుట్టిందని కొడుకుని కాస్త కూతురి అవతారంలో పెంచుతుంటాడు కళామందిర్ కళ్యాణ్. అలా చిన్నప్పుడే అమ్మాయి గెటప్ లో కనిపిస్తాడు రాధాకృష్ణ. యవ్వనదశలోకి వచ్చిన తరువాత రాధాకృష్ణ మహిళలకు అండగా ఓ ఆర్గనైజేషన్ లాంటిది రన్ చేస్తుంటాడు. అమ్మాయిల్లో కూడా ధైర్యం ఉంటుందని, దేన్నైనా ఎదుర్కోగలరనే నమ్మకాన్ని కలిగిస్తుంటాడు. కరాటే, బాక్సింగ్, డాన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలను సపోర్ట్ చేస్తుంటాడు.

Latest Videos

undefined

ఈ ప్రాసెస్ లో అతడికి మానస(కాశ్మీర) అనే అమ్మాయి దగ్గరవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అదే సమయంలో సత్య(యామిని భాస్కర్) అనే మరో అమ్మాయి రాధాకృష్ణను ప్రేమిస్తుంది. కళామందిర్ కళ్యాణ్ తన కొడుకు ప్రేమిస్తున్నది సత్యనే అనుకొని వారి కుటుంబంతో సంబంధం కలుపుకుంటాడు. సత్య కుటుంబం రాయలసీమకి చెందిన వారు. వారిని మోసం చేస్తే ప్రాణాలు తీసేసే రకం. వీరి నుండి తప్పించుకోవడానికి రాధాకృష్ణ తను మగాడ్ని కాదని గే అని చెబుతాడు. రాధాకృష్ణ నిజంగానే గే అనుకున్న సత్య అన్నయ్య రాజా(అన్నయ్య) అతడు కూడా గే అని రాధాకృష్ణని పెళ్లి చేసుకుంటానని షాక్ ఇస్తాడు. మరి ఈ పరిస్థితుల నుండి రాధాకృష్ణ ఎలా బయటపడతాడు..? తను ప్రేమించిన అమ్మాయిని రాధాకృష్ణ పెళ్లి చేసుకోగలిగాడా..? లేక సత్య కుటుంబం పెట్టే టార్చర్ కి బలైపోతాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
'నర్తనశాల' అనే టైటిల్ ను తన సినిమాకు వాడుకొని నాగశౌర్య పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి. కథ మీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్లాడు కానీ అతడు అనుకున్న రిజల్ట్ ను మాత్రం ఈ సినిమాతో అందుకోలేకపోయారు. సినిమా మొదలుపెట్టిన తీరే సినిమా మీద ఆసక్తి సన్నగిల్లేలా చేస్తుంది. అర్ధంలేని సన్నివేశాలతో మొదలైన సినిమాను అలానే నడిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ కి ఒక క్లారిటీ అంటూ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం మహిళలను ఎంకరేజ్ చేసే మనిషిగా గొప్పగా చూపించాలనుకొని బోల్తా పడ్డారు. నాగశౌర్య ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. ఒక అమ్మాయిని ప్రోత్సహించి ఆమెతోనే రౌడీలను కొట్టే సీన్స్ చాలా ఓవర్ గా అనిపిస్తాయి. సదరు సీన్ లో నటించిన మహిళ కూడా అతి చేసిందనే చెప్పాలి.

ఇక హీరోయిన్ సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆమె కష్టం తెలుసుకున్న హీరో ఆమె దాని నుండి బయటపడేలా చేయడం... ఈ ప్రాసెస్ లో ఇద్దరూ ప్రేమలో పడడం.. రొటీన్ కే రొటీన్ అనిపించే సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఇచ్చిన ట్విస్ట్ ఒకింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎలాగో స్టోరీ లేదు.. కనీసం కామెడీ అయినా ఉండి ఉంటే బాగుండేది. ఇక ద్వితీయార్ధంలో కామెడీకి పెద్ద పీట వేశారు. కానీ ఆ సన్నివేశాలు అందరినీ నవ్విస్తాయనైతే చెప్పలేం. జయప్రకాష్ రెడ్డి పాత్రతో కామెడీ చేయించాలని ప్రయత్నించారు. ఆయన కామెడీకి జనాలు నవ్వి చాలా కాలం అయింది. ఈసారి స్క్రీన్ మీద పొత్రం పొత్రం అంటూ చెప్పినా డైలాగ్స్ కొంత నవ్వించినా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

సెకండ్ హాఫ్ లో నాగశౌర్య, అజయ్ కాంబినేషన్ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. బేబీ బేబీ అంటూ నాగశౌర్యను అజయ్ పిలిచే తీరు విసిగిస్తుంది. ఇక టైమ్ దొరికినప్పుడల్లా అజయ్.. శౌర్యతో చేసే రొమాన్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మరింత విసిగించాయి. నాగశౌర్య లాంటి మంచి గ్లామర్ ఉన్న హీరో ఇలాంటి కథలను ఎన్నుకోవడం బాధాకరం. నటుడిగా తనను నిరూపించుకోవడానికి అతడు చేసే ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. ఇప్పటికైనా.. తేరుకొని మంచి కథలతో సినిమాలు చేస్తే బాగుంటుంది. 'ఛలో' తరువాత రెండు ఫ్లాప్ సినిమాలు వచ్చినా.. అతడిని నమ్మి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లను, సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్ 'నర్తనశాల'తో నిరాశ పడడం ఖాయం. ఇద్దరు హీరోయిన్లు ఏమంత ఆకట్టుకోలేకపోయారు.

యామిని భాస్కర్ తెరపై గ్లామర్ షో చేస్తున్నా.. ఆమెలో సెక్స్ అప్పీలే కనిపించదు. ఇక రెండో హీరోయిన్ కాశ్మీర.. పూనమ్ కౌర్ లాగా అనిపిస్తుంది. అజయ్ గే పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. శివాజీరాజాను పెర్ఫార్మ్ చేయమంటే అతి చేశాడనిపిస్తుంది. కథలో సత్తా లేకపోతే ఆర్టిస్టులు, సాంకేతికనిపుణులు మాత్రం ఏం చేయగలరు. సంగీతం ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది. నేపధ్య సంగీతం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. పాటల్లో కనిపించిన ఫారెన్ లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తం ఒకే చోట జరుగుతున్నా.. చూడడానికి ఇబ్బంది కలగకుండా తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేశారు సినిమాటోగ్రాఫర్. పెళ్లి పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. మొదటి భాగంలో ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందనిపిస్తుంది. సినిమా బాగుంటే మూడు గంటలైనా చూసే ప్రేక్షకుడు ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకే విసిగిపోతాడు.

ఈ మధ్యకాలంలో చాలా మంది నూతన దర్శకులు తన టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఈ సినిమా దర్శకుడు మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచాడనే చెప్పాలి. బలమైన కథ, కథనాలు లేకుండా సినిమా చేసి ప్రేక్షకులను సహనాన్ని పరీక్షించాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. కామెడీ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి కూడా ఈ సినిమా పెద్దగా అఆకట్టుకోదు. అసలు నాగశౌర్య ఏం నచ్చి కథ ఓకే చేశారనేది అర్ధం కాని విషయం. భవిష్యత్తులోనైనా మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం!
 
రేటింగ్: 2/5  

ఇవి కూడా చదవండి.. 

రివ్యూ: ఆటగాళ్ళు

రివ్యూ: నీవెవరో

రివ్యూ: గీత గోవిందం

click me!