
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) వారిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సోమవారం దర్శించుకున్నారు. అఖండ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందంతో కలిసి బాలకృష్ణ యదాద్రి ఆలయాన్ని (Yadadri temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణ వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ పనులను బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాదాద్రి అద్భుతం అన్న బాలకృష్ణ.. సీఎం కేసీఆర్ చొరవతో ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. యాదాద్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత దేవాలయం అని అన్నారు.
యాదాద్రి పరిసరాలను కలుషితం చేయకుండా చూసుకోవాలని కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మనం ఎంత చేసిన దేవుడి అనుగ్రహం లేనిది సరైన ఫలితాలు అందవ్వనేది అందరి నమ్మకం అని అన్నారు. నరసింహ స్వామి పేరు తన సినిమాల్లో కొన్నింటి టైటిల్స్‌లో కూడా ఉంది. నరసింహ స్వామి అనుగ్రహం తన మీద ఉందని.. తన ఇష్ట దైవం కూడా నరసింహ స్వామి అని బాలకృష్ణ చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను యాదగిరి గుట్టకు వస్తున్నానని.. ఆయలం ఇప్పుడు అద్భుతంగా ఉందని ప్రశంసించారు.