
సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో చెరువు కట్టని ఆక్రమించి, ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ని నిర్మించారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక ఎన్-కన్వెన్షన్ సెంటర్‌పై అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది. అయితే నాగార్జున ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి సమస్య పరిష్కరించుకున్నాడన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది.
గతంలో అక్రమ కట్టడాలంటూ హైదరాబాద్ లోని పలు నిర్మాణాల్ని కూల్చివేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలోనే ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూడా అక్రమ కట్టడం అన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. అయితే ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు, కూల్చివేతను ఆపేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం తెరపైకొచ్చింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా పెద్ద రచ్చకే కారణమయ్యింది. సభలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు నాగార్జునకే ఎందుకు ఆఫర్ ఇచ్చారనీ, పేదల ఇళ్ళు కూల్చేస్తూ, నాగార్జునకి చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
దీంతో, తెలంగాణ సర్కార్ డిఫెన్స్‌లో పడిపోక తప్పలేదు. నాగార్జునకైనా, ఇంకెవరికైనా ఇందులో మినహాయింపులు వుండబోవనీ, చట్టపరమైన సమస్యల కారణంగా ఆ వ్యవహారం పెండింగ్‌లో పడిందని మునిసిపల్ మంత్రి కేటీఆర్ నేరుగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ని అప్పట్లో నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
తనకున్న పొలిటికల్ పరిచయాలతో అక్రమంగా నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ని నిర్మించారనే ఆరోపణలు అప్పటికీ, ఇప్పటికీ అలాగే వున్నాయి. ఓ దశలో ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తప్పదన్న వాదనలు తెరపైకి వచ్చినా, వివాదం సద్దుమణిగిపోయింది. అయితే.. తాజాగా, అసెంబ్లీలో విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎన్-కన్వెన్షన్ సెంటర్ వివాదంలో నాగ్ స్పందన ఎలా వుంటుంది.? సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఎన్-కన్వెన్షన్ వివాదం నాగార్జునని ఇప్పట్లో వదిలేలా కన్పించడంలేదు.