జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే వచ్చా : హీరో నాగార్జున .. చర్చలపై సస్పెన్స్

By Aithagoni Raju  |  First Published Oct 28, 2021, 7:22 PM IST

ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jaganmohan Reddy)ని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు హీరో నాగార్జున(nagarjun) అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం Nagarjunaతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో సినిమాల సందడి స్టార్ట్ అయ్యింది. రానున్న రోజుల్లో మరింతగా సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. 

అందులో భాగంగా చిన్నా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ప్రధానంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేదిగా ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Latest Videos

undefined

సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నాగార్జున నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నాగ్‌ మీడియాతో మాట్లాడుతూ, `జగన్‌ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్‌తో కలిసి లంచ్‌ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది` అని తెలిపారు. అయితే తమ మధ్య జరిగిన చర్చల విషయాలను ఆయన వెల్లడించకపోవడం గమనార్హం. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో కలిసేందుకు చిరంజీవితోపాటు నాగార్జున వెళ్లారు. టాలీవుడ్‌ సమస్యలపై చర్చించేందుకు ప్రధానంగా చిరు, నాగ్‌ ముందుండి చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల సమయంలోనూ నాగ్‌తోపాటు చిరంజీవి, ఇతర స్టార్‌ డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం నాగార్జున ఒక్కరే ఏపీ సీఎంని కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి మధ్య ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది.

also read : మరోసారి బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా.. మహేష్‌ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

అయితే ఇటీవల జరిగిన `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికల్లో చిరంజీవి పేరు తెరపైకి తీసుకొచ్చారు మంచు మోహన్‌బాబు. `మా` అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుని తప్పుకోవాలని చిరంజీవి కోరినట్టు వెల్లడించారు. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ సైతం చిత్ర పరిశ్రమకు సంబంధించి  ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుపై సైతం ఆయన పలు వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి ఈ చర్చలకు దూరంగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనేక అనుమానాలకు తావిస్తుంది. కావాలనే చిరుని పక్కన పెట్టారా? లేక చిరంజీవినే దీనికి దూరంగా ఉన్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది. 

aslo read: సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున.. చిరంజీవి లేకుండానే మీటింగ్

click me!