నిజ జీవిత భార్యాభర్తలైన నాగచైతన్య, సమంత, వీళ్లిద్దరిని కలిపి సినిమా చేస్తే ఖచ్చితంగా క్రేజ్ అయితే క్రియేట్ అవుతుందని దర్సకుడు ఏరికోరి ..ఈ పెయిర్ తో ప్లాన్ చేసినట్లున్నారు. ట్రైలర్స్, టీజర్స్ తో సక్సెస్ అయ్యారు. మంచి ఓపినింగ్స్ రప్పించుకునే బజ్ క్రియేట్ అయ్యింది.
----సూర్య ప్రకాష్ జోశ్యుల
నాగచైతన్యకు చాలా కాలంగా హిట్ అనేది లేదు. దాంతో ఏ జానర్ తను సెట్ అవుతాడు. తను ఏ తరహా సినిమా చేస్తే హిట్ వస్తుందో అనే క్లారిటీ లేకుండాపోయింది. మరో ప్రక్క సమంత ...ఏ జానర్ అయినా తన గ్రిప్ లోకి హిట్ కొట్టేస్తోంది. దాంతో నిజ జీవిత భార్యాభర్తలైన వీళ్లిద్దరిని కలిపి సినిమా చేస్తే ఖచ్చితంగా క్రేజ్ అయితే క్రియేట్ అవుతుందని దర్సకుడు ఏరికోరి ..ఈ పెయిర్ తో ప్లాన్ చేసినట్లున్నారు. ట్రైలర్స్, టీజర్స్ తో సక్సెస్ అయ్యారు. మంచి ఓపినింగ్స్ రప్పించుకునే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రిలీజైన సినిమా ఆ అంచనాలను అందుకుందా..నాగచైతన్య కెరీర్ కు రిలీఫ్ ఇచ్చిందా..అసలు కథేంటి వంటి విషయాలను రివ్యూలో చూద్దాం...
undefined
కథేంటి...
వైజాగ్ కుర్రాడు పూర్ణ(నాగ చైతన్య)కు క్రికెట్ అంటే పిచ్చి. కెరీర్ లో బెస్ట్ క్రికెటర్ గా ఎదుగుదామనుకుంటాడు. అందుకు తండ్రి (రావు రమేష్) ఓ సంవత్సరం టైమ్ ఇస్తాడు. ఈ టైమ్ లాక్ లో క్రికెటర్ గా ముందుకు వెళ్దామని ప్రయత్నాలు చేస్తూంటే అతని జీవితంలోకి వైజాగ్ నావీ ఆఫీసర్ (అతుల్ కులకర్ణి) కుమార్తె అన్షు(దివ్యాంశ కౌశిక్) ప్రవేశిస్తుంది. పరిచయం .. స్నేహంగా...ఆ తర్వాత ప్రేమగా టర్న్ తీసుకుంటుంది. ఈ లోగా క్రికెట్ ప్రపంచంలో ఎంట్రీకి ఓ కార్పోరేటర్ (సుబ్బరాజు) అడ్డం పడతాడు. అతనితో గొడవ ...పూర్ణ ప్రేమకు కూడా గండి కొట్టేస్తుంది. దాంతో ఆ ప్రేమికులు ఇద్దరూ లేచివచ్చి తాజ్ హోటల్ లో ఓ రూమ్ లో దాక్కుంటారు. ఓ ప్రక్క సుబ్బరాజు గూండాలు , మరో ప్రక్క అన్షు పేరెంట్స్ వీళ్ల కోసం వెతుకుతూంటారు. ఈ క్రమంలో అన్షు తాను బయిటకు వెళ్లి సమస్యను సాల్వ్ చేసుకుని వస్తానని అక్కడే హోటల్ రూమ్ లో వెయిట్ చేయమంటుంది పూర్ణని.
అయితే ఆమె వెనక్కి తిరిగి రాదు. ఆ తర్వాత కొంతకాలానికి తన తండ్రి కోసం పూర్ణ...శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే పూర్ణ తన తొలి ప్రేమను మర్చిపోలేడు. ఆ ధ్యాసలోనే జీవితం గడుపుతూంటాడు.అన్షు దూరమైందన్న బాధలో తన కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతు అవుతాడు. అయినా శ్రావణి తన భర్తనే సపోర్ట్ చేస్తూ అతని తోడే జీవితంగా గడుపుతూ ఉంటుంది. ఎప్పటికైనా మారకపోతాడా అని ఎదురుచూస్తూంటుంది.
ఈ లోగా కొన్ని నాటకీయ పరిణామాలతో వారి జీవితంలోకి మీరా అనే పాప ప్రవేశిస్తుంది. ఆ పాప వచ్చాక వాళ్లిద్దరి జీవితాల్లో మార్పులు వస్తాయి. అసలు ఇంతకీ మీరా ఎవరు..? డిప్రెషన్ లో ఉన్న పూర్ణ ఎలా తిరిగి మామూలు మనిషి అయ్యాడు? శ్రావణిని భార్యగా ఏక్సెప్టు చేసాడా ? ఇంతకీ ఆ రోజు బయిటకు వెళ్లిన అన్షు ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.
డైరక్టర్ మూవీ
ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో జరిగే ఈ చిత్రం పూర్తిగా డైరక్టర్ సినిమా. క్యారక్టరైజేషన్స్ నుంచి సీన్స్ పుట్టించి, వాటి చుట్టూ చక్కటి, చిక్కటి కథనం అల్లాడు. సాధారణమైన స్టోరీ లైన్ కు చిన్న పాటి సస్పెన్స్ ని కలిపి స్క్రీన్ ప్లే చేసి భావోద్వేగాలతో మన బాదరబందీలను కళ్లముందుంచి మ్యాజిక్ చేసారు దర్శకుడు. రచనలో నిజాయితీనే ఈ సినిమాకు యుఎస్ పి. చాలా మంది జీవితం ప్రారంభ రోజుల్లో ఎదురయ్యే సంఘటనలను ప్రతిబింబచటం, జ్ఞాపకాలను తట్టి లేపటం వంటి అంశాలను ఈ సినిమా దిగ్విజయంగా చేయగలిగింది. ఫస్టాఫ్ ప్రేమ,క్రికెట్, స్నేహితులతోనూ సెంకండాఫ్ వైవాహిక జీవితం చుట్టూ నడిపాడు. దాంతో కొన్ని ట్విస్ట్ లు సినిమాటెక్ గా అనిపించినా, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కాస్త పాతవాసన కొట్టినా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే స్లో నేరేషన్ మాత్రం ఈ స్పీడు రోజుల్లో ఎడ్జెస్ట్ చేసుకోవటం కష్టం అనిపిస్తుంది. అలాగే లెంగ్త్ కాస్త తగ్గిస్తే బాగుండేది. మన్మధుడు చిత్రాన్ని గుర్తు చేసే ట్విస్ట్ కూడా బాగుంది. అలాగే డైరక్టర్ పనితనం అంతా...ఈ సినిమాని సుబ్బరాజు, నాగచైతన్యల మధ్య ఎపిసోడ్స్ ని హైలెట్ చేయకుండా వాటిని సబ్ ప్లాట్ గా వాడుకోవటంలోనే ఉందనిపిస్తుంది. లేకపోతే ఇది ఎమోషనల్ మూవి కాకుండా మరో రొటీన్ ఫ్యామిలీ యాక్షన్ సినిమా అయ్యేది.
ఎవరెలా చేసారు
నాగచైతన్య నుంచి ఈ స్దాయి సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ చూడటం మాత్రం ఆశ్చర్యమే. అంటే ఇన్నాళ్లూ అతనికి డైరక్టర్స్ అలా నటించే అవకాశం ఇవ్వలేదో ... అతనితో నటనను చేయించుకోలేదో అనుకోవాలి. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. కాకపోతే సోగ్గాడి పెళ్లాంలో(మోహన్ బాబు) రమ్యకృష్ణ పాత్ర గుర్తుకు వస్తుంది. దివ్యాంశ కౌశిక్ పోటీపడిందని అనలేం కానీ బాగా చేసింది. రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి ఇద్దరూ ఈ సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చారు., సుబ్బరాజు, అతుల్ కులకర్ణిలు ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా..
సినిమాకు ఓ మూడ్ ని క్రియేట్ చేసే విజువల్స్ ని పేర్చిన సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనిపిస్తుంది. రెండు పాటలు బాగున్నాయి. మిగతా వి కాలక్రమేణా ఎక్కుతాయేమో. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్, మిగతా డిపార్టమెంట్ లు సినిమాని మరో మెట్టు ఎక్కించాయి.
ఫైనల్ థాట్
కొన్ని ఎమోషన్స్ ఎప్పటికీ పాతబడవు.
ఎవరెవరు
నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేశ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
కళ: సాహి సురేశ్
పోరాటాలు: వెంకట్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
సంగీతం: గోపీసుందర్
నేపథ్య సంగీతం: తమన్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.
సంస్థ: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 5 ఏప్రిల్ 2019
rating: 3/5
మజిలీ మూవీ పబ్లిక్ టాక్ (వీడియో)
'మజిలీ' ప్రీమియర్ షో కలెక్షన్స్!