
ఈ అర్థరాత్రి నుంచి భారత దేశ వ్యాప్తంగా అమలు కానున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ప్రభావం సినీ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీని స్వాగతించేది లేదంటూ పలు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ వర్గాలు నిరసన తెలుపుతున్నాయి. జీఎస్టీ అమలు చేయడం వల్ల రాష్ట్రాలు బలహీన పడతాయని, ప్రతి విషయంలోనూ కేంద్రానికి మోకరిల్లాల్సిన దుస్థితి వస్తుందని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
ఇక సినిమా రంగంపైనా జీఎస్టీ ప్రభావం తీవ్రంగా పడనుంది. ఇప్పటికే టికెట్ల ధరలు పెంచుతూ ఆయా థియేటర్ల యాజమాన్యాలు ప్రకటనలు కూడా జారీ చేశాయి. అయితే.. తెలంగాణకు సంబంధించి ప్రస్థుతానికి ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇవ్వనుందున టికెట్ ధరల పెంపు నిర్ణయం వాయిదా పడింది. అయితే ఏ క్షణంలోనైనా సినిమా టికెట్ ధరలు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్థుతం 150 రూపాయలున్న టికెట్ ఇకపై 200 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది.
జీఎస్టీ వల్ల తెలంగాణపైనా 12వేల కోట్ల రూపాయల భారం పడనుందని అంచనా. సామాన్యులు వినియోగించుకునే అన్ని వస్తువులపైనా పన్ను విధించడం వల్ల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పైనా పన్నుల భారం పడనుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినా తెలంగాణ సర్కారు జీఎస్టీని స్వాగతిస్తుండటం గమనార్హం.
ఇక తమిళనాడులో సినీ పరిశ్రమ వర్గాల నుంచి జీఎస్టీపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ లాంటి అగ్ర నటులు జీఎస్టీని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సోమవారం నుంచి జీఎస్టీని నిరసిస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేయనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. దీంతో తమిళనాట సినీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. ఒకవేళ థియేటర్ల మూసివేసిన తర్వాత తిరిగి ఎప్పుడు తెరుస్తారోనని, సినీ పరిశ్రమకు ఎంత మేరకు నష్టం వాటిల్లే ప్రమాదముందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీస్టీ వల్ల 28 శాతం పన్ను పడితే నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వీస్ రంగం అంటు ప్రతి దానిపై పన్ను విధించడం దారుణమని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.