
మహేష్ బాబు-అల్లరి నరేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. వీళ్లిద్దరి కాంబో నిజం కాబోతోందంటూ కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఓ ప్రచారం నడుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలో అల్లరోడు ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ ఈ మధ్య వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఐతే ఈ కాంబో జనాలకు అంత నమ్మకం కలిగించలేదు.
ఐతే ఇప్పుడు అల్లరి నరేషే స్వయంగా మహేష్‌తో కలిసి నటించే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలిచ్చాడు. తన పుట్టిన రోజు నేపథ్యంలో మీడియాను కలిసిన నరేష్.. మహేష్ సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అని చెప్పాడు. ఐతే ఏదీ ఫైనలైజ్ కాలేదని.. ఓకే అయ్యాక తానే ప్రకటిస్తానని చెప్పాడు. అల్లరోడితో ఓ పాత్ర చేయించాలని సంప్రదించారంటే అటు వైపు నుంచి అతణ్ని తీసుకోవడానికి ఆసక్తితో ఉన్నట్లే. హీరోగా కెరీర్ చాలా డల్లుగా ఉన్న నేపథ్యంలో పాత్ర నచ్చితే నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి.
కాబట్టి మహేష్-నరేష్ కలిసి నటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లే. మరి నరేష్ ఈ సినిమా చేస్తే అతడి కెరీర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. దిల్ రాజు-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేష్ సరసన పూజా హెగ్డేను కథానాయికగా నటింపజేయాలనుకుంటున్నారు. ముందు పీవీపీ నిర్మాణంలో అనుకున్న ఈ చిత్రం.. తర్వాత కొన్ని కారణాల వల్ల దిల్ రాజు, అశ్వనీదత్‌ల చేతికొచ్చింది.