
టాలీవుడ్ లో మరో విషాదం. మిథునం సినిమా నిర్మాత.. సమాజ సేవకుడు మొయిద ఆనందరావు(57) బుధవారం ఉదయం కన్ను మూశారు. చాలా కాలంగా డయాబెటిక్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన.. కొంతకాలంగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్ ప్రముఖులు ఆనందరావుకు నివాళి అర్పిస్తున్నారు.
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామంలో జన్మించారు ఆనందరావు. సాధారణ చిరు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి.. వ్యాపారవేత్తగా ఎదిగారు. మంచి పనులకు ముందుండే ఆనందరావు సంఘసేవకుడిగా పేరుగాంచారు. ఎన్నో జీవితాలలో వెలుగు నింపారు. ఆయనకు సాహిత్యం అన్నా.. పర్యావరణం అన్నా ఎంతో ప్రేమ. అంతే కాదు స్వతహాగా కవిత్వాలు, పద్యాలు రాసి.. కోటిగాడు పేరుతో ప్రచురించారు ఆనందరావు. ఆయన గ్రామంలో 25 లక్షలు ఖర్చుచేసి గ్రంథాలయం ఏర్పాటుచేశారు నిర్మాత.
గాయకుడు, నటుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రలుగా.. నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో మిథునం సినిమా ను నిర్మించారు ఆనందరావు. అందరు నిర్మాతల్లా కమర్షియల్ గా ఆలోచించకుండా మిథునం సినిమాతో అందరిని ఆలోచింపచేశారు. 2012 లో రిలీజ్ అయిన మిథునం సినిమా.. 2017 లో నందీ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆనందరావుకు భార్య పద్మిని, ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.