మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట చిత్రం థియేటర్స్ లో దిగనుంది. మహేష్ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మహేష్ ఏపీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్స్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వం పరిశ్రమ ప్రముఖుల మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు సీఎం జగన్ (CM Jagan)ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఏపీ మంత్రులను సన్నాసులు అంటూ తిట్టిపోశారు. దానితో పరిశ్రమ సమస్య రాజకీయ వివాదంగా మలుపు తీసుకుంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని పరిష్కారం తీసుకొచ్చారు.
మహేష్, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి వంటి పెద్దలతో పాటు చిరంజీవి సీఎం జగన్ ని కలిసి పరిశ్రమ సమస్యలు వివరించడం జరిగింది. అనంతరం పరిశ్రమ ప్రయోజనాలు, ప్రజల ఆర్ధిక స్థోమత దృష్టిలో ఉంచుకొని ధరలు సవరిస్తూ కొత్త జీవో ప్రభుత్వం జారీ చేసింది. సీఎం తో మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో సీఎం జగన్ కి చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్ కృతఙ్ఞతలు తెలిపారు.
undefined
మరలా సర్కారు వారి పాట (Sarkaru vaari paata) చిత్ర విడుదలకు ముందు విలేకరుల ప్రశ్నకు సమాధానంగా మహేష్ సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ సీఎం జగన్ పై పొగడ్తలు కురిపించారు. మహేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎప్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది.
ఆయన ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో చాలా విషయాలను చర్చించాం. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. బయట ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు అడిగారు. ఇలాంటి మీటింగ్స్ మరికొన్ని జరిగితే బాగుంటుందని నేను అన్నాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది’ అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh babu)అన్నారు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట టికెట్స్ ధరలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మే 12న సర్కారు వారి పాట భారీ ఎత్తున విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందించారు.